మౌనముని మూవీపై వివాదమేంటి? ది యాక్సిడెంటల్‌ పీఎంలో ఏం చూపించారు?

మౌనముని మూవీపై వివాదమేంటి? ది యాక్సిడెంటల్‌ పీఎంలో ఏం చూపించారు?
x
Highlights

సిల్వర్‌ స్క్రీన్‌పై పొలిటికల్‌ బయోపిక్‌లు రచ్చరచ్చ చేస్తున్నాయి. తెరకెక్కుతున్న రాజకీయ ఉద్దండుల జీవితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. విడుదలకు ముందే...

సిల్వర్‌ స్క్రీన్‌పై పొలిటికల్‌ బయోపిక్‌లు రచ్చరచ్చ చేస్తున్నాయి. తెరకెక్కుతున్న రాజకీయ ఉద్దండుల జీవితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. విడుదలకు ముందే వివాదాలు రాజేస్తున్నాయి. మొన్న ఇందిర, నిన్న ఎన్టీఆర్‌, ఎంజీఆర్, నేడు మన్మోహన్‌ లైఫ్‌ ఆధారంగా సినిమాలు. ఎన్నికల ముంగిట్లో విడుదల అవుతున్న పొలిటికల్‌ బయోపిక్‌‌లు, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. 2014లో సంచలనం సృష్టించిన సంజయ్ బారు పుస్తకం. ఇప్పుడు ఇదే పుస్తకం వెండితెరపైకి వస్తోంది. ప్రధానిగా మన్మోహన్ జీవితాన్ని జనాల కళ్లకు కట్టబోతోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమకు చూపందే, విడుదల చేయొద్దని అంటోంది. అనేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, సినిమాపై నిషేధానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు బీజేపీ మాత్రం, కాంగ్రెస్ ఆరోపణలు ఖండిస్తోంది. ట్రైలర్‌కే ఇంత కాంట్రావర్సీ క్రియేట్ అయితే, ఇక సినిమా రిలీజైన తర్వాత పరిస్థితి ఏంటి..అసలు

యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌ ట్రైలర్‌, అలా విడుదలయ్యిందో, లేదో యూట్యూబ్‌లో లక్షల హిట్స్‌‌తో దూసుకుపోవడమే కాదు, మిలియన్ల కాంట్రావర్సీ క్రియేట్ చేస్తోంది. ఇందులోని కథనం, పాత్రలు, వాటిని మలిచిన తీరు, డైలాగ్స్‌పై, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబం. ఎందుకంటే, మహాభారతంలో రెండు కుటుంబాలుంటే, భారతదేశంలో మాత్రం ఒకటే ఫ్యామిలీ అంటూ మొదలయ్యే ట్రైలర్‌‌, సహజంగానే సోనియా గాంధీ కుటుంబాన్ని టార్గెట్‌ చేశారని తెలిసిపోతోంది. సరిగ్గా ఎన్నికల ముందు, అంటే జనవరి 11న వెండితెర మీదకు రాబోతోంది మన్మోహన్‌ మూవీ. అందుకే కాంగ్రెస్‌ దీనిపై అబ్జెక్షన్‌ చెబుతోంది. తమకు ప్రివ్యూ చూపిన తర్వాత, రిలీజ్ చెయ్యాలంటోంది. కొన్ని సన్నివేశాలను సెన్సార్‌ చెయ్యాలంటోంది.

అయితే బీజేపీ మాత్రం, కాంగ్రెస్‌ తీరుపై మండిపడుతోంది. పద్మావతి సినిమా రిలీజ్ టైంలో, సినిమా అనేది భావప్రకటనా స్వేచ్చ అన్న కాంగ్రెస్, ఇప్పుడెందుకు సినిమాపై అభ్యంతరాలు చెబుతోందని ప్రశ్నిస్తోంది. మన్మోహన్‌ మాజీ సలహాదారురు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా తీస్తున్న చిత్రంపై అబ్జెక్షన్‌ ఎందుకంటోంది. కాంగ్రెస్‌ వ్యవస్థాపన దినోత్సవం కార్యక్రమానికి హాజరైన మన్మోహన్‌ సింగ్, ఈ సినిమాపై కామెంట్‌ చేయడానికి నిరాకరించారు. ఈ సినిమా కథ మొత్తం మన్మోహన్‌దే. 2004లో సోనియా ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి రావడం, వెంటనే ఆమెను వ్యతిరేకిస్తూ, విదేశీయతను ప్రశ్నిస్తూ, బీజేపీ సహా కొన్ని పార్టీలు బాహాటంగా నిరసనలు తెలపడంతో, విధిలేని పరిస్థితుల్లో ఆర్థికవేత్త, మాజీ ఆర్థికమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను కూర్చోబెట్టడం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి. అయితే మన్మోహన్‌ను పీఎం పీఠంపై పేరుకు మాత్రమే కూర్చోబెట్టి, వెనకాల చక్రం తిప్పింది మొత్తం సోనియానేనని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. మన్మోహన్‌ను కీలుబొమ్మగా ఆడించి, అధికారం మొత్తాన్ని చలాయించింది సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలేనని, సినిమా ద్వారా చెప్పబోతున్నట్టు, ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.

న్యూక్లియర్‌ డీల్‌ విషయంలో, మిత్రపక్షాల ఒత్తిడికి సోనియా తలొగ్గడం, పార్టీనే ముఖ్యమని మన్మోహన్‌కు సీరియస్‌గా చెప్పడం వంటి సోనియా డైలాగులు కనిపిస్తాయి. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా అణు ఒప్పందాన్ని, మన్మోహన్‌ గట్టిగా పట్టుబడటం, ట్రైలర్‌లో చూపించారు. అమెరికాతో అణు ఒప్పందం విషయంలో, చివరికి రాజీనామాకూ మన్మోహన్‌ సిద్దపడినట్టు ట్రైలర్‌లో చూపారు. ప్రధానిగా మన్మోహన్‌ను, స్వతంత్రంగా వ్యవహరించనివ్వలేదని, ఆయనను ముందుపెట్టి, వెనకాల అనేక స్కామ్‌లకు స్కెచ్‌ వేసింది సోనియా కుటుంబమేనన్న అర్థంవచ్చేలా చూపుతున్నారని తెలుస్తోంది. అవే సన్నివేశాలను గట్టిగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్.

మన్మోహన్‌ పదేళ్లు ప్రధానిగా పాలించారు. 2014 చివరి నాటికి పదేళ్ల పాలన కుంభకోణాలమయమైంది. కామన్వెల్త్ గేమ్స్ మొదలుకుని టుజీ స్కామ్‌ వరకూ, కాంగ్రెస్‌ సర్కారుకు అనేక మరకలంటాయి. ఈ కుంభకోణాలన్నీ సోనియా కుటుంబానివేనని బీజేపీతో పాటు అనేక పార్టీల ఆరోపణ. దేశం అవినీతిమయం అవుతన్నా, మౌనమునిలా మన్మోహన్‌ ఉండిపోయారని, అనేక విమర్శలొచ్చాయి. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీకి అదే ఆయుధమైంది కూడా. అయితే, చరిత్ర తన గురించి నిజాయితీగా చెబుతుందని ఒక ఇంటర్వ్యూలో మన్మోహన్‌ వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో కూడా మన్మోహన్‌ పాత్రను గొప్పగానే చూపారు. అయితే విధిలేని పరిస్థితుల్లో పీఎం పీఠంపై కూర్చోవడం, సోనియా రిమోట్‌ కంట్రోల్‌గా వ్యవహరించడంతో, మన్మోహన్‌ మంచోడే అన్న క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. సోనియా గాంధీ కుటుంబాన్నే టార్గెట్‌ చేశారని, అర్థమవుతోంది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నేతలే కాదు, మన్మోహన్ పాత్రధారి అనుపమ్ ఖేర్‌ కూడా ఖండించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories