Top
logo

ఒకమ్మాయి ఇద్దరబ్బాయిల కథ.. చివరకు...

X
Highlights

సినిమా స్క్రిప్ట్‌కు మించిన రియల్‌ స్టోరీ.. ఇప్పటి ట్రెండ్‌కు ఏమాత్రం తగ్గని ప్రేమకథ. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను...

సినిమా స్క్రిప్ట్‌కు మించిన రియల్‌ స్టోరీ.. ఇప్పటి ట్రెండ్‌కు ఏమాత్రం తగ్గని ప్రేమకథ. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించే.. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఒకమ్మాయి ఇద్దరబ్బాయిల కథ.. చివరకు మంటల్లో కాలిపోయింది. ఇద్దరి ప్రేమికుల ప్రాణాలను బలిగొంది. ఒళ్లు గగుర్పొడిచే ట్రాజెడీగా.. ముగిసింది. జగిత్యాల జిల్లాలో జరిగిన రియల్‌ లవ్‌ స్టోరీపై హెచ్‌ఎంటీ ప్రత్యేక కథనం.

వీరిద్దరూ రవితేజ, మహేందర్‌. జగిత్యాల విద్యానగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం వీరిద్దరూ కలిసి పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో నిర్మాణుష్య ప్రదేశంలో ముందుగా.. మందు కొట్టారు. ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలకు ఒళ్లంతా కాలిపోతున్న సమయంలో ఆ బాధ తట్టుకోలేక ఇద్దరూ అరుపులూ కేకలు వేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే పూర్తిగా కాలిపోయిన మహేందర్‌.. అక్కడే ప్రాణాలు కోల్పోగా.. రవితేజను మాత్రం కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ.. రవితేజ కూడా ప్రాణాలు వదిలాడు.

ఈ ఇద్దరు ప్రాణాలు తీసుకోడానికి కారణం.. ప్రేమ. మహేందర్‌, రవితేజలిద్దరూ క్లాస్‌ మేట్‌ అయిన ఓ అమ్మాయిని ప్రేమించారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఆ అమ్మాయిని ఇష్టపడ్డారు. కానీ ఎవరూ తమ ప్రేమ విషయాన్ని.. ఆ అమ్మాయికి చెప్పలేకపోయారు. అయితే చివరకు ఒకే అమ్మాయిని లవ్‌ చేస్తున్నట్లు తెలుసుకున్న ఇద్దరూ మాట్లాడుకుందామని ఆదివారం మధ్యాహ్నం మిషన్‌ కాంపౌండ్‌లోని నిర్మాణుష్య ప్రదేశానికి వెళ్లారు. వెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించారు. ఆ మత్తులో ఇద్దరూ గొడవ పడ్డారు. అంతే.. ఆవేశంతో ఆ ఇద్దరూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.

తీవ్ర కలకలం సృష్టించిన ఆత్మహత్యలపై జగిత్యాల పోలీసులు విచారణ చేపట్టారు. స్పాట్‌లో ఉన్న సెల్‌‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే ఇద్దరి ఆత్మహత్యలకు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే విచారణ తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఒక్కసారిగా ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టితోంది. ప్రేమ వ్యవహారం కావడంతో.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

ప్రేమ త్యాగాన్ని కోరుతుందని అంటారు. కానీ అలాంటి ప్రేమను అనుభూతి చెందాలంటే ఎంతో పరిణితి అవసరం. కానీ ఈ రోజుల్లో మూతిపై మీసం మొలిచేకంటే ముందుగానే.. మదిలో ప్రేమ పువ్వు వికసిస్తోంది. గుండెలో లవ్‌ అలారం మోగుతుంది. అది ప్రేమా, ఆకర్షణా అన్నదే తెలియని వయస్సులోనే చాలామంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా జగిత్యాలలో పదో తరగతి దశలోనే పుట్టిన ప్రేమ కోసం ఇద్దరు ప్రాణాలు తీసుకోవడం అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోయింది.

అనిర్వచనీయమైన అనుభూతే ప్రేమ. అలాంటి ప్రేమను విశ్లేషించిన ధాఖలాలు ఎక్కడా కనిపించవు. ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా ప్రేమను వివరిస్తారు. అంత గొప్ప ప్రేమ ఇప్పుడు ప్రాణాలు తీసేందుకు లేక అవే ప్రాణాలు తీసుకునేందుకు ఓ ఆయుధంగా మారిపోయింది. తాజాగా జగిత్యాలలో జరిగిన జంట మరణాలు ప్రేమ వ్యవహారాల్లో చీకటి కోణాలను కళ్లముందుంచుతోంది. పదో తరగతిలో అంటే సుమారు 15 యేళ్లు కూడా దాటని వయస్సులో ప్రేమలో పడ్డారు. ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం చెప్పకుండా మనస్సులో దాచుకుని మధన పడటం ఒకే అమ్మాయిని ప్రేమించామని తెలుసుకుని ప్రాణాలు తీసుకోవడం.

తెలిసీ తెలియని వయస్సులోనే.. ఎదుటి మనిషిలో కనిపించే ఆకర్షణే.. ప్రేమగా భ్రమించడం.. దానికోసం ఎంతకైనా తెగించడం.. అవసరమైతే ప్రాణత్యాగం చేసుకోవడం కామన్‌గా మారిపోయింది. ఈ రోజుల్లో 8 వ తరగతి నుంచే ప్రేమ కథలు మొదలవుతున్నాయి. పదో తరగతి వచ్చేలోగా.. అమ్మాయి కానీ అబ్బాయి కానీ.. ప్రేమలో పడాల్సిందే. ఓ లవర్‌ను మెయింటేన్‌ చేయాల్సిందే. లేకుంటే ఆ వ్యక్తి.. మిగతావారి కంటే వెనుకబడిపోయినట్లే అనే వాతావరణాన్ని సృష్టిస్తారు.

చదువుకునే వయస్సులో చదువే ప్రాణంగా ఉండాలి కానీ.. చాలామంది ప్రేమ పేరుతో.. ఎంతో విలువైన కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. అమ్మాయి లేకపోతే ఇక తన జీవితమే లేదనే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు. ఇందుకు సినిమాలే చాలావరకు కారణమవుతున్నాయి. ఇలాంటి దారుణ సంస్కృతికి ప్రాణం పోస్తున్న మూవీలు.. విద్యార్థుల మెదళ్లను కలుషితం చేస్తున్నాయి. అమ్మాయి ప్రేమకోసమే జీవితం అని.. లేకుంటే దానికో అర్థం పర్థం లేదంటూ పనికిమాలిన భ్రమలను కల్పిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే.. ప్రేమ ప్రాణం పోస్తుంది. ప్రేమించినవారి కోసం.. ఆ ప్రాణాన్ని త్యాగం చేస్తోంది. కానీ ఎదిగీ ఎదగని వయస్సులో పుట్టిన ఫీలింగ్‌.. పరిపక్వత లేని ఆకర్షణే కానీ.. అదెన్నటికీ ప్రేమ కాదు.

Next Story