logo
జాతీయం

భారత న్యాయవ్యవస్థ పై దీపక్ మిశ్రా చెరగని ముద్ర...పలు కేసుల్లో సంచలనాత్మక తీర్పులు

X
Highlights

భారత న్యాయవ్యవస్థలో తమదైన ముద్ర వేసిన చీఫ్ జస్టిస్ లు అరుదుగా ఉన్నారు. అలాంటి వారి జాబితాలో చీఫ్ జస్టిస్ దీపక్ ...

భారత న్యాయవ్యవస్థలో తమదైన ముద్ర వేసిన చీఫ్ జస్టిస్ లు అరుదుగా ఉన్నారు. అలాంటి వారి జాబితాలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా కూడా చేరారు. భారత్ 45వ చీఫ్ జస్టిస్ గా, సుమారు 14 నెలల కాలంలో వివిధ ధర్మసనాల్లో ఉంటూ ఆయన ఇచ్చిన తీర్పులు సంచలనం సృష్టించాయి. గత నెల రోజుల కాలంలో ఆయన ఇచ్చిన తీర్పులు దేశంలో న్యాయవ్యవస్థ చరిత్రలో మైలు రాళ్ళుగా నిలిచిపోతాయి. మరీ ముఖ్యంగా చివరి పది రోజుల్లో ఇచ్చిన తీర్పులు సంచలనం సృష్టించాయి. తాజాగా సోమవారం నాడు ఆయన తన చివరి పనిదినాన్ని పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తీర్పులు, అవి సృష్టించిన ప్రకంపనలు . గత వారం సుప్రీం కోర్టుకు ఈ ఏడాదిలో అత్యంత ముఖ్యమైన వారమైంది. సుప్రీం కోర్టు 47 తీర్పులు వెలువరించింది. అందులో 20 ప్రధాన న్యాయమూర్తి తీర్పులకు సంబంధించినవి కావడం విశేషం. అక్టోబర్ 2న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన తీర్పులు.

దేశంలో రాజకీయాలు నేరగ్రస్తమైపోయాయి. నేరచరిత గల వారిని రాజకీయాలకు దూరం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నేరారోపణలు ఉన్న వారిని సైతం రాజకీయాలకు దూరం చేయాలన్న వాదన కూడా వచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం మాత్రం ఈ వాదనను తిరస్కరించింది. అలాంటి వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించలేం అని స్పష్టం చేసింది. రాజకీయాలు నేరగ్రస్తం కాకుండా చట్టం చేయాల్సిందిగా పార్లమెంట్ కు సూచించింది. అదే సమయంలో నేరారోపణలు వచ్చిన అభ్యర్థుల చరిత్ర ప్రజలకు తెలిసేందుకు వీలుగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. నేర చరిత ఉన్న వారు ఎన్నికల సమయంలో కనీసం మూడుసార్లు తమ పై ఉన్న కేసుల గురించి మీడియా ద్వారా తెలియజేయాలి. ఆయా పార్టీలు తమ అధికారిక వెబ్ సైట్లలో అభ్యర్థుల నేరచరిత వివరించాలి. నిజంగా ఈ తీర్పు హర్షణీయమే. ఆయా అభ్యర్థులపై ఉన్న కేసులు ఎలాంటివో, వారిపై ఎలాంటి నేరారోపణలు వచ్చాయో, వాటి తీవ్రత ఎంతనో ఓటర్లు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు న్యాయవాది వృత్తిలో కూడా కొనసాగవచ్చా అనే అంశంపై ఎప్పటినుండొ వివాదం నడుస్తోంది. ఎట్టకేలకు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. చట్టసభలకు ఎన్నికైన వారు న్యాయవాద వృత్తిలో కొనసాగవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిజానికి ఈ అంశం ఇప్పటిది కాదు. లోక్ సభ కు జరిగిన మొదటి ఎన్నికల నుంచి కూడా ఈ వివాదం ఏదో ఒకస్థాయిలో చర్చకు వస్తూనే ఉంది. 1952లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీల్లో 36 శాతం మంది న్యాయవాదులే. ప్రస్తుత లోక్ సభలో వీరు 7 శాతమే ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ లో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నారు. 1979 నాటి తీర్పు ను ఈ సందర్భంగా పిటిషనర్ ప్రస్తావించారు. ఎం.కరుణానిధి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా ఇది ప్రసిద్ధి పొందింది. తాను పబ్లిక్ సర్వెంట్ ను కానని కరుణానిధి వాదించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పబ్లిక్ సర్వెంట్స్ అని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బార్ కౌన్సిల్ వాదనలు విన్న తరువాత తాజాగా సుప్రీం కోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యాయవాద వృత్తిలో కొనసాగడంలో తప్పు లేదని స్పష్టం చేసింది.

భారతదేశ జైళ్ళు నరకానికి నకళ్ళు అని అంటుంటారు. కిక్కిరిసిపోయిన జైళ్ళు విచారణకు నోచుకోని ఖైదీలు కనీస వసతుల కొరతలతో మరెన్నో సమస్యలు ఉన్నాయి. దీనిపై కూడా సుప్రీం కోర్టు దృష్టి సారించింది. ఈ అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు సిఫారసులు చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఇక మరో ముఖ్యమైన కేసు విషయానికి వస్తే బాక్టీరియాను తుదముట్టించేందుకు సూర్యరశ్మిని మించింది లేదు. సుప్రీం కోర్టు కూడా దీన్నే విశ్వసించింది. అందుకే రాజ్యాంగప్రాధాన్యం గల కేసుల విచారణ లైవ్ స్ట్రీమింగ్ ను అనుమతించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. లైవ్ స్ట్రీమింగ్ తో కేసుల విచారణలో పారదర్శకత పెరుగుతుందని సుప్రీం కోర్టు భావించింది. అదే సమయంలో కక్షిదారుల పరువుప్రతిష్టలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పులన్నీ కూడా సుప్రీం కోర్టు పేరు ప్రతిష్టలను మరింత పెంచేవే అనడంలో సందేహం లేదు.

ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, ఆధార్, ఇతరులతో భార్యాభర్తల లైంగిక సంబంధాలు, అయోధ్య కేసు, శబరిమలలోకి మహిళల ప్రవేశం స్వలింగ సంపర్కం తదితర అంశాల్లోనూ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా కీలక తీర్పులను వెలువరించారు. అవన్నీ కూడా దేశంలో సంచలనం కలిగించాయి. అదే సమయంలో అప్పటి వరకూ సమాజంలో ఉన్న కొన్ని విలువలను, భావనలను ప్రశ్నార్థకం చేసేలా కూడా ఈ తీర్పులు ఉన్నాయన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.

ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంలో అప్పటి వరకూ ప్రధాన అడ్డంకిగా ఉన్న ఒక నిబంధనను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఒక కమ్యూనిటీకి సంబంధించిన వెనుకబాటుతనంపై గణాంకాలు సేకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో క్రీమీలేయర్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. క్రీమీలేయర్ ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. క్రీమీలేయర్ పై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్న సమయంలో ఈ తీర్పు వెలువడింది. ఇక, ఈ తరహా రిజర్వేషన్ల అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. ఇక ఆధార్ విష‍‍యానికి వస్తే సూత్రప్రాయంగా ఆధార్ ను సమర్థించింది. అదే సమయంలో ఆధార్ కొన్నిటికి అవసరం లేదని స్పష్టం చేసింది. మొత్తం మీద మాత్రం ఆధార్ లేకుండా జీవితం కొనసాగించలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఆ విధంగా చేయడాన్ని ఎంతో మంది వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది.

భార్యాభర్తల అక్రమ సంబంధాలపై సుప్రీం కోర్టు వెలువరించి తీర్పు సంచలనం సృష్టించింది. భార్య ఇతరులతో సంబంధం పెట్టుకోవడం క్రిమినల్ నేరం కాదని స్పష్టం చేసింది. అదే సమయంలో విడాకులు తీసుకునేందుకు ఒక అంశంగా ఉంటుందని కూడా పేర్కొంది. ఈ తీర్పుపై కూడా దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెక్షన్ 497 ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. సమాజంలో నైతికత లోపించే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి తగ్గట్లుగా వెలువడిన తీర్పుల్లో ఒకటిగా దీన్ని భావించవచ్చు. స్వలింగ సంపర్కం కేసు కూడా ఇలాంటిదే. స్వలింగ సంపర్కంపై కేసులు పెట్టడాన్ని నిరోధించే విధంగా తీర్పు వెలువడింది. ఒకే జెండర్ కు చెందిన వారి మధ్య సంబంధాలను నిషేధిస్తూ 1860లలో రూపొందిన చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. దేశంలో సామాజిక నైతికత వర్తించదని, రాజ్యాంగబద్దమైన నైతికత మాత్రమే వహిస్తుందని స్పష్టం చేసింది. మెజారిటీ ప్రజల అభిప్రాయాలు రాజ్యాంగపరమైన హక్కులను నిర్దేశించలేవని ప్రకటించింది. ఇతరుల మాదిరిగానే ఎల్టీబీటీలకు మానవ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. సమాజంలో ఆయా వర్గాలపై నెలకొన్న చిన్నచూపును తొలగించేందుకు, ఆయా వర్గాల వారు పోలీసులు వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ఈ తీర్పు తోడ్పడగలదు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. ఆధ్యాత్మిక విలువలు ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి. అది మత వ్యవహారాల్లో కోర్టు జోక్యంగా చేసుకోవడంగా భావించిన వారూ ఉన్నారు. సుప్రీం కోర్టు మాత్రం ఆ ఆచారాన్ని లింగ వివక్ష గా భావించింది. సమానత్వ హక్కు ఉల్లంఘనగా ప్రకటించింది. శతాబ్దాలుగా ఉన్న ఆచారం ఇక కనుమరుగు కానుంది.

చంద్రుడిపై మచ్చలా ఒక అంశం మాత్రం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పై మచ్చ పడేలా చేసింది. ఆయన వ్యవహారశైలిని వ్యతిరేక్తిస్తూ నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా కొంతమంది న్యాయమూర్తులు ఇలా చేయడం అదే తొలిసారి. ఇలాంటి ఒకటి, రెండు అంశాలు మినహాయిస్తే దీపక్ మిశ్రా తన పదవీ కాలంలో ఇచ్చిన తీర్పులు ఆయనకు ఎంతో వన్నె తెచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. దేశ న్యాయవ్యవస్థలో అవి మైలురాళ్ళుగా నిలిచిపోయాయి. పదవీ విరమణ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కూడా ఎంతో అద్భుతంగా సాగింది. ఎన్నో దాడులను తట్టుకుంటూ భారతదేశ న్యాయవ్యవస్థ ఎంతో దృఢంగా ఉందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను ఎప్పటికీ కాపాడాల్సి ఉంటుందన్నారు. న్యాయానికి మానవతావాదం తోడు కావాలన్నారు. ఆయన మాటలు నిజమే. ఆయన ఇచ్చిన పలు తీర్పుల్లోనూ ఆ మానవతావాదం ప్రతిఫలించింది.

Next Story