logo
సినిమా

రివ్యూ: ఛల్‌ మోహన్‌ రంగ

రివ్యూ: ఛల్‌ మోహన్‌ రంగ
X
Highlights

టైటిల్ : ఛల్‌ మోహన్‌ రంగ జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ తారాగణం : నితిన్‌, మేఘ ఆకాష్‌, లిజి, నరేష్‌,...

టైటిల్ : ఛల్‌ మోహన్‌ రంగ
జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నితిన్‌, మేఘ ఆకాష్‌, లిజి, నరేష్‌, ప్రగతి, నర్రా శ్రీను, మదు నందన్‌
సంగీతం : తమన్‌ ఎస్‌
కథ : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
దర్శకత్వం : కృష్ణ చైతన్య
నిర్మాత : పవన్ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సుధాకర్‌ రెడ్డి

ఛల్ మోహన్ రంగ నితిన్ కెరీర్ లో 25వ మూవీ. ఒక్క హిట్ ఒక్క ఫ్లాప్ అన్నట్టుగా కెరీర్ ను నెట్టుకొస్తున్న నితిన్..ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అందుకోసం సినిమాను కట్టుదిట్టంగానే తెరకెక్కించాడు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అండదండంతో రంగంలోకి దిగాడు. టాలీవుడ్ లవర్ భాయ్ నితిన్ కు లవ్ స్టోరీ సినిమాలే బాగా కలిసి వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో జయం, దిల్ వంటి యూత్ లవ్ ఫుల్ ఎంటర్ టైనర్ తో విజయాలు అందుకున్న నితిన్..మధ్యలో ట్రాక్ మార్చాడు. మాస్ ఇమేజ్ కోసం తపించి, బొక్క బోర్లా పడ్డాడు. చివరికి యాక్షన్ సినిమాలు సెట్ కావాని తెలుసుకున్న మళ్లీ ప్రేమకథా సినిమాలకే మొగ్గుచూపాడు..ఛల్ మోహన్ రంగ సినిమాతో కాలంతో పాటు మారే డిఫరెంట్ లవ్ స్టోరీని సిద్దం చేశాడు. త్రివిక్రమ్ స్వయంగా కథ అందించిన ఈ సినిమా నితిన్‌ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టిందా..? పవన్‌ త్రివిక్రమ్‌లు నిర్మాతలుగా మారి తెరకెక్కించిన ఈ సినిమా విజయం సాధించిందా..?

Chal Mohan Ranga Movie Review In Telugu - Sakshi

కథ : మోహన్‌ రంగ (నితిన్‌) ఓ మధ్య తరగతి కుర్రాడు. చిన్నతనంలో తనకు పరిచయం అయిన అమ్మాయి అమెరికా వెళ్లిందని తెలుసుకొని ఎలాగైన అమెరికా వెళ్లాలని ఆ వయసులోనే నిర్ణయించుకుంటాడు. తరువాత అమ్మాయి విషయం మర్చిపోయినా అమెరికా ఆశతోనే పెరిగి పెద్దవాడవుతాడు. మూడుసార్లు వీసా రిజెక్ట్ కావటంతో ఇండియాలో చనిపోయిన ఓ పెద్దావిడ శవాన్ని అమెరికా తీసుకెళ్లే కారణం చూపించి వీసా సంపాదిస్తాడు. అమెరికా వెళ్లిన మోహన్‌ రంగ ముందు కాస్త ఇబ్బంది పడినా ఫైనల్‌ గా ఓ మంచి జాబ్‌ సాధిస్తాడు. ఈ ప్రయత్నాల్లోనే మేఘ సుబ్రమణ్యం (మేఘ ఆకాష్‌) అనే అమ్మాయితో రంగకు పరిచయం అవుతుంది. తల్లిచూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మేఘ.. రంగ వ్యక్తిత్వం నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. రంగ కూడా మేఘను ఇష్టపడతాడు. కానీ ఇద్దరి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు వేరు కావటంతో ప్రేమ గురించి ఒకరితో ఒకరు చెప్పుకోకుండానే దూరమవుతారు. మేఘ తల్లితో పాటు ఇండియా వచ్చేస్తోంది. రంగ కూడా మేఘను మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కొంత కాలం తరువాత మేఘను ఒక్కసారి కలవాలని ఇండియాకు వస్తాడు మోహన్‌ రంగ. రంగ వచ్చే సరికి మేఘ ఏ పరిస్థితుల్లో ఉంది..? రంగ తన ప్రేమను మేఘకు చెప్పాడా..? వాళ్లిద్దరు ఒక్కటయ్యారా..? అన్నదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే: రంగగా నితిన్‌ అభినయం ఆకట్టుకుంటుంది. తొలి సగంలో వీసా కోసం అతను పడే పాట్లలో నితిన్‌ అల్లరి అందంగా కనిపిస్తుంది. హీరో పాత్రతోనే చాలా సన్నివేశాలు నడిచిపోతాయి. మేఘా ఆకాశ్‌ అందంగా కన్పించారు. అభినయంగానూ వంక పెట్టలేం. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. రావు రమేశ్‌, నరేశ్‌, మధునందన్‌, నర్రా శ్రీనివాస్‌కు కీలక పాత్రలు దక్కాయి. చాలా కాలం తర్వాత నటి లిజి తెరపై కన్పించారు. కథంతా నితిన్‌, మేఘల చుట్టూనే నడిచింది. మిగిలిన వారంతా వీరిద్దరికీ సపోర్ట్‌ చేశారు. తమన్‌ సంగీతం ఆకట్టుకుంటుంది. ‘నువ్వు పెద్దపులి’ పాట మాస్‌కు నచ్చుతుంది. మిగిలినవన్నీ మెలొడీ ప్రధానంగా సాగేవే. ‘ఘ..ఘ..మేఘ’ అనే పాట చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఎక్కువగా అమెరికా నేపథ్యంలో సాగిన కథ ఇది. అక్కడి లొకేషన్లు, ఊటీ అందాల వల్ల ఈ కథకు కొత్త ఫ్లేవర్‌ వచ్చింది. ఛాయాగ్రహణం ఉన్నత స్థాయిలో ఉంది. దర్శకుడు సంభాషణల విభాగంలో తన పనితనాన్ని చూపించాడు. చాలా చోట్ల త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు త్రివిక్రమే రాశారేమో అనిపిస్తాయి. బలమైన కథ ఎంచుకుని ద్వితీయార్థంలోనూ ఇంకాస్త వినోదం ఉండి ఉంటే ‘ఛల్‌ మోహన్‌ రంగ’ మరింత చక్కగా వచ్చేది.

విశ్లేషణ : రౌడీఫెలో సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య... ఛల్‌ మోహన్‌ రంగతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అందించిన రొటీన్‌ కథను తనదైన కథనంతో ఆసక్తికరంగా చూపించాడు. ముఖ్యంగా గేయ రచయిత అయిన కృష్ణచైతన్య డైలాగ్స్ తో సినిమా రేంజ్‌ ను పెంచాడు. కృష్ణ చైతన్య సంభాషణల్లో చాలా సార్లు త్రివిక్రమ్‌ కనిపిస్తాడు. ముఖ్యంగా ప్రాసలు, పంచ్‌ల విషయంలో త్రివిక్రమ్‌నే ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ప్రేమ, తరువాత మనస్పర్థలు, బ్రేకప్‌, తిరిగి కలవటం ఇది గతంలో తెలుగు తెర మీద చాలా సార్లు వచ్చిన కథే అయినా.. కథకు తీసుకున్న నేపథ్యం, సంభాషణలు ఆడియన్స్‌ను అలరిస్తాయి. అయితే అక్కడక్కడా కథనం నెమ్మదించటం ఇబ్బంది పెడుతుంది. తమన్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. న్యూయార్క్‌ సిటీని కలర్‌ఫుల్‌ గా చూపించిన సినిమాటోగ్రాఫర్‌ ఊటి అందాలను అంతే అ‍ద్భుతంగా చూపించారు. ఎటిడింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

బలాలు:
+ నితిన్‌, మేఘా ఆకాశ్‌
+వినోదం
+డైలాగులు
+లొకేషన్లు
బలహీనతలు:
- తెలిసిన కథ
- సెకండాఫ్‌

Next Story