Top
logo

ఆస్తి కోసం చిన్నమ్మను చంపేందుకు పథకం.. నిందితుడిని పట్టించిన సెల్‍ఫోన్‍ చార్జర్‍

Highlights

తనకు ఆస్తి ఇవ్వకుండా అడ్డుకుంటున్న చిన్నమ్మను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు మధ్యప్రదేశ్‍ వెళ్ళి...

తనకు ఆస్తి ఇవ్వకుండా అడ్డుకుంటున్న చిన్నమ్మను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు మధ్యప్రదేశ్‍ వెళ్ళి రివాల్వర్‍, బుల్లెట్లు కొనుక్కొని ఇంటికి బయల్దేరాడు. మరికొన్ని గంటల్లో ఇల్లు చేరి చంపేయడమే తరువాయి అనుకోగా తోటి ప్రయాణికుడు అతని ప్లానంతా తారుమారు చేశాడు. పొరపాటున రివాల్వర్‍ ఉన్న బ్యాగును తీసుకుపోయాడు. దీంతో ఆ బ్యాగు కాస్తా పోలీసులకు చేరింది. తుపాకీ పోతే పోయిందిలే అని ఊరు చేరిన ఆ వ్యక్తిని బ్యాగులో ఉన్న సెల్‍ఫోన్‍ చార్జర్‍ పట్టించింది. కటకటాల్లో ఊచలు లెక్కించేలా చేసింది.

ఈ నెల 2న మహబూబ్‍నగర్‍ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆర్టీసి బస్సులో ఓ రివాల్వర్‍ లభ్యమైంది. హైద్రాబాద్‍కు చెందిన సంపత్‍కుమార్‍ అనే సాఫ్ట్ వేర్‍ ఇంజనీర్‍ తుపాకీ ఉన్న బ్యాగును దేవరకద్ర పోలీసులకు అప్పజెప్పాడు. దానిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మహబూబ్‍నగర్‍ జిల్లా ఉట్కూర్‍ మండలం అవుసులోని పల్లి గ్రామానికి చెందిన వడ్డె హన్మంతు తన చిన్నమ్మను హత్య చేసేందుకు ఈ పిస్టల్‍ ను మధ్యప్రదేశ్‍ నుంచి కొని తెచ్చినట్టు జిల్లా ఎస్పీ అనురాధ తెలిపారు.

నిందితుడు హన్మంతు తండ్రికి ముగ్గురు భార్యలు. అందులో మొదటి భార్య సంతానమైన హన్మంతు తనకు ఆస్తిలో వాటా కోసం తరచూ గొడవపడేవాడు. తండ్రి ఇస్తానని నమ్ముతూ వస్తుండగా చిన్నమ్మ మణెమ్మ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు రివాల్వర్‍ కొన్నాడు.

నిందితుడిని పట్టుకునేందుకు అతని బ్యాగులోని సెల్‍ఫోన్‍ చార్జర్‍ కీలక పాత్ర పోషించింది. చార్జర్‍ మీద ఉన్న ఫోన్ నంబర్‍ ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఆరాంఘర్‍ నుంచి మహబూబ్‍నగర్‍ వరకు అన్ని బస్టాండ్లలోని సీసీటీవీ పుటేజీ పరిశీలించి నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. సంపత్‍కుమార్‍ లా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తే క్రైం రేటును కాస్తంతైనా తగ్గించవచ్చనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలిచింది.

Next Story