logo
జాతీయం

రాజస్థాన్ లో కమలం వాడిపోతోందా?

రాజస్థాన్ లో కమలం వాడిపోతోందా?
X
Highlights

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా ఉంది రాజస్థాన్ లో బిజెపి పరిస్థితి ఓటమి భయం వెన్నాడటంతో పోల్ షెడ్యూల్...

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా ఉంది రాజస్థాన్ లో బిజెపి పరిస్థితి ఓటమి భయం వెన్నాడటంతో పోల్ షెడ్యూల్ ను చివరికి మార్చినా ప్రచారంలో పదును పెంచినా బిజెపికి అక్కడ కష్టకాలమేననే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం వసుంధర వ్యవహార శైలిపై బిజెపి పెద్దలే మండి పడుతున్నారు.

రాజస్థాన్ లో కమలం వాడిపోతోందా? ఎన్నికలకు ముందే ఆ పార్టీ పరిస్థితి డీలా పడిపోవడం కమలనాథుల్లో టెన్షన్ పెంచుతోంది. ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రభుత్వంపై పెల్లుబుకుతున్నవ్యతిరేకతను తగ్గించడానికి బిజెపి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరి నిమిషం వరకూ ఆమె గెలుపు డౌటేనంటున్నారు విశ్లేషకులు రాజస్థాన్ లో ఉవ్వెత్తున లేస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత దృష్ట్యా ఆ రాష్ట్ర పోలింగ్ తేదీని చివరకు జరిపించారు బిజెపి పెద్దలు మరోవైపు రాష్ట్రంలో బిజెపి శ్రేణులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ పై వ్యతిరేక ప్రచారాన్నీ ముమ్మరం చేశారు ప్రధాని మోడీ కూడా రాజస్థాన్ లో పర్యటించి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు అయినా అక్కడ బిజెపి నేతలను మాత్రం ఓటమి భయం వెన్నాడుతోంది. 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతున్నాయి. గెలుపు ఓటములను ప్రభావితం చేసే రాజ్ పుత్ వంశస్థులు ఆ రాష్ట్రంలో 12 శాతం ఉన్నారు. దాదాపు పాతిక నియోజక వర్గాలను వారు ప్రభావితం చేయగలరు రాజ్ పుత్ వంశస్థులకు ముఖ్యమంత్రి వసుంధరకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తినడంతో రాష్ట్ర బిజెపి అధిష్టానం ఆందోళన పడుతోంది.

బిజెపి మాతృసంస్థ జనసంఘ్ నాటి నుంచీ రాజ్ పుత్ లు బిజెపి పక్షం వహిస్తూ వస్తున్నారు. 2016 నుంచి రాజ్ పుత్ వంశస్థులతో వసుంధరా ప్రభుత్వం ఢీ అంటే ఢీ అంటోంది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు సిటింగ్ ఎమ్మెల్యే మానవేంద్ర సింగ్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే వసుంధర తొందరపాటు నిర్ణయాలు ఆమెకే చేటు చేశాయి. రాజ్ మహల్ భూ వివాదంలో ఆమె వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. అలాగే రాజ్ పుత్ వంశానికి చెందిన గ్యాంగ్ స్టర్ ఆనంద్ పాల్ సింగ్ ను ఎన్ కౌంటర్ చేయడం ఆ వంశస్థులను ఆగ్రహానికి గురి చేసింది. ఇక పద్మావత్ సినిమా షూటింగ్, తదనంతర పరిణామాలు కూడా వసుంధరా రాజే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్ ను నియమించాలన్న ప్రతిపాదనలనూ ఆమె తోసిపుచ్చడంతో రాజ్ పుత్ లు ఆమె పేరు చెబితేనే మండి పడుతున్నారు. ఎన్నికల ముందు ఈ పరిణామాలు కచ్చితంగా ప్రభావం చూపిస్తాయని బిజెపి నేతలే చెబుతున్నారు.రాజ్ పుత్ లు దాదాపు రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉండటం కనీసం 25 నియోజక వర్గాలను ప్రభావితం చేసే సత్తా కలిగి ఉండటంతో బిజెపి పెద్దలు అటు వసుంధరకు నచ్చ చెప్పలేక పార్టీని కాపాడుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అక్కడ బిజెపి ఎన్నికవ్వాలంటే రాజ్ పుత్ లు చాలా చాలా కీలకం.

మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ రాజస్థాన్ కు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటేనే అక్కడ రాజ్ పుత్ ల ప్రభావం ఎంతుందో అంచనా వేయచ్చు. రాజస్థాన్ లో కీలకమైన రాజకుటుంబానికి చెందిన రాణి పద్మినీ దేవి రాజ మహల్ భవనం ప్రధాన ద్వారాన్ని అన్యాక్రాంతమైన భూముల కింద వసుంధర సర్కార్ స్వాధీనం చేసుకుంది. ఇది రాజ్ పుత్ వంశస్థుల కడుపు రగిలించింది. గత అసెంబ్లీ ఎన్నికల నాడే రాణి పద్మిని కుటుంబం బిజెపి లో చేరింది. సొంత పార్టీ నుంచే తమ కుటుంబానికి అవమానాలెదురవుతున్నాయని పద్మిని దేవి కుటుంబం భావిస్తోంది. ఇక రావణ్ రాజ్ పుత్ కమ్యూనిటీకి చెందిన గ్యాంగ్ స్టర్ ఆనంద్ పాల్ సింగ్ ఎన్ కౌంటర్ రాజ్ పుత్ కుటుంబాల్లో వ్యతిరేకతను నింపింది. రాజ్ పుత్ వంశంలో అట్టడుగు స్థాయికి చెందిన వ్యక్తే అయినా ఎన్ కౌంటర్ చేయడం ఆ వంశస్థుల్లో సానుభూతిని నింపింది. దీనిపై సిబిఐ విచారణకు ఒత్తిడి చేయగా సరేనన్న రాష్ట్ర సర్కార్ ఆనంద్ పాల్ కు వ్యతిరేకంగా 115 కేసులను తిరగదోడింది. దీంతో రాజ్ పుత్ లకు వసుంధరకు మధ్య సంబంధాలు మరింత బెడిసి కొట్టాయి. ఈ వివాదాలు ఇలా రగులుతుండగానే పద్మా వత్ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణనే వ్యతిరేకించిన రాజ్ పుత్ లు ఆ సినిమాపై నిషేధం విధించాలని పట్టుబట్టారు. అయితే చివరి నిమిషంలో సర్కార్ తూతూ మంత్రంగా నిషేధం విధించి చేతులు దులుపు కోడమూ వారికి కోపం తెప్పించింది.

ఇక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా గజేంద్ర షెకావత్ ను నియమించాలన్న సూచనలు , ప్రతిపాదనలను వసుంధర ఏకపక్షంగా తిరస్కరించారు. బిజెపి హై కమాండ్ దగ్గరున్న పలుకుబడితో ఓబిసి నేత, రాజ్య సభ ఎంపీ అయిన మదన్ లాల్ సైనీని ఆ పదవిలో నియమించారు. ఇది కూడా రాజ్ పుత్ లకు కోపం తెప్పించింది. తమ వంశంపై వసుంధర కక్షతో ఉద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నారన్న భావన వారిలో నెలకొంది. ఈ కారణాలకు తోడు మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోడానికి వసుంధర వ్యవహార శైలే కారణమని బిజెపి శ్రేణులే మండి పడుతున్నాయి. పరిస్థితులను బట్టి తన పంథాను మార్చు కోవాల్సిన వసుంధర రాజే మొండిగా పంతంతో అడుగు లేస్తుండటం బిజెపి పెద్దల్లో కూడా అసహనాన్ని కలుగ చేస్తోంది. దీనికి తోడు సిటింగ్ లలో వంద నుంచి 125 మందికి ఈసారి టిక్కెట్ అనుమానమేననే వార్తలున్నాయి. రాజస్థాన్ లో బిజెపికి కష్టకాలం నడుస్తోందని ఎన్నికల్లో గెలుపు అనుమానమేనని బిజెపి పెద్దలే టెన్షన్ పడుతుంటే కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరం కనిపిస్తోంది.

Next Story