శాతవాహన వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత

శాతవాహన వర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత
x
Highlights

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ రణరంగంగా మారింది. PDSU, DSU, BSF, TVV విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట మనుధర్మశాస్త్రానికి సంబంధించిన...

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ రణరంగంగా మారింది. PDSU, DSU, BSF, TVV విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట మనుధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ABVP, RSS విద్యార్థి సం ఘాలు.. వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం రాళ్లురువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ABVP, బహుజన విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ మనుస్మృతిని తగులపెట్టిన చారిత్రక దినాన్ని గుర్తు చేసుకుంటూ బహుజన విద్యార్థి సంఘాలు మనుధర్మ శాస్త్ర ప్రతులను దగ్ధం చేశాయి.

యూనివర్శిటీలో మనుస్మృతిని కాల్చి హాస్టళ్లలోకి వెళ్తుండగా భరతమాత చిత్రపటాన్ని దహనం చేస్తున్నారన్న సమాచారం మేరకు బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు రావటంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఇరు సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాలు నినాదాలు చేసుకోవడం, రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సమాచారమందుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రవేశించి ఆందోళనకారులను చెదరగొట్టారు. నాలుగు గంటలపాటు వర్సిటీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. వర్సిటీ ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. 100 మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేశారు.

యూనివర్సిటీ అధికారులతో సమావేశమైన సీపీ కమలాసన్‌రెడ్డి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నాయకులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా సీపీ అనుమతించలేదు. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు బీజేపీ నాయకులతో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్‌ చేశారు. వర్సిటీ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు సీపీ కమలాసన్ రెడ్డి చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అల్లర్లకు దిగొద్దని సూచించారు. ప్రాంగణంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నటు చెప్పారు.

గొడవల నేపథ్యంలో వర్సటీని నిరవధికంగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. వర్సిటీ సైన్స్, ఆర్ట్స్, ఫార్మసీ కళాశాలలతో పాటు సంబంధిత మెస్‌లు, హాస్టళ్లు బంద్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వర్సిటీలో శాంతిని నెలకొల్పాలని కోరారు. జనవరి 2న జరగనున్న పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ల పరీక్షలపై ఈ నెల 27న ప్రకటిస్తామని తెలిపారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోం దని పార్టీలు, ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. మనుధర్మశాస్త్ర దిష్టిబొమ్మను శాంతియుతంగా దహనం చేసిన వామపక్ష, బహుజన విద్యార్థి సంఘాలపై ABVP, RSS, BJP నేతలు దాడులు చేయడాన్ని ఖండించారు. వర్సిటీలో దేశభక్తి, మంచి నడవడిక నేర్పాల్సిన ప్రొఫెసర్లు విద్యార్థులను చెడుమార్గంలోకి మళ్లీస్తూ గొడవలకు కారకులవుతున్నారని ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఆరోపించారు. ప్రాంగనంలో అల్లర్లకు ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ సూరేపెల్లి సుజాతను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులకు నిరసనగా నేడు విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories