logo
జాతీయం

బల పరీక్షకు ముందు కుమార స్వామికి భారీ షాక్

బల పరీక్షకు ముందు కుమార స్వామికి భారీ షాక్
X
Highlights

కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇరు...

కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేలను కలిపితే కూటమి వద్ద 117 ఎమ్మెల్యేలున్నారు. స్పీకర్‌ ఎంపిక తర్వాత ఈ ఎన్నిక జరగనున్నందున సభలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బలపరీక్షలో గెలిచేందుకు 111 మంది మద్దతు అవసరం. దీంతో చివరి నిమిషంలో రాజకీయాలు చోటుచేసుకుంటేతప్ప కూటమి సర్కారు ‘పరీక్ష’లో నెగ్గటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. కుమారస్వామితో పాటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు.

శాసనసభలో కుమార స్వామి ప్రభుత్వం బలపరీక్ష జరగబోతున్న తరుణంలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎంత కాలం మనగలుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ గురువారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల కీలక సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత డీ కే శివ కుమార్ గైర్హాజరయ్యారు. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐకమత్యంగా ఉండేలా ఆయన కృషి చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

కర్ణాటకలో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండాలని కాంగ్రెస్‌లోని లింగాయత్ ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు సమాచారం. లింగాయత్‌లకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తాము రాజీనామా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక శాసనసభలో కుమార స్వామి ప్రభుత్వం బలపరీక్ష శుక్రవారం జరుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని బీజేపీ ఆశిస్తోంది. మరోవైపు రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గం ఎన్నికల విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. జేడీఎస్ అభ్యర్థిని గెలిపించాలని కుమార స్వామి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్నకు మద్దతివ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ఓటరు ఐడీ కార్డులు ఓ ఫ్లాట్‌లో పట్టుబడటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story