logo
సినిమా

‘భరత్‌ అనే నేను’ రివ్యూ

‘భరత్‌ అనే నేను’ రివ్యూ
X
Highlights

చిత్రం: భరత్‌ అనే నేను నటీనటులు: మహేష్‌బాబు.. కైరా అడ్వాణీ.. ప్రకాష్‌రాజ్‌.. శరత్‌కుమార్‌.. రమాప్రభ.....

చిత్రం: భరత్‌ అనే నేను
నటీనటులు: మహేష్‌బాబు.. కైరా అడ్వాణీ.. ప్రకాష్‌రాజ్‌.. శరత్‌కుమార్‌.. రమాప్రభ.. దేవరాజ్‌.. ఆమని.. సితార.. పోసాని కృష్ణమురళి.. రవిశంకర్‌.. జీవా.. యశ్‌పాల్‌ శర్మ.. రావు రమేష్‌.. అజయ్‌.. బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్‌, తిరు
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
కళ: సురేష్‌ సెల్వరాజన్‌
సాహిత్యం: రామ జోగయ్యశాస్త్రి
నిర్మాత: డీవీవీ దానయ్య
దర్శకత్వం: కొరటాల శివ
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ:20-04-2018

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి ఒక్క సినిమా..హై ఎక్స్ పెక్సేషన్స్ తోనే రిలీజవుతుంది. కానీ భరత్ అనే నేను సినిమా మాత్రం ఇంకాస్త ప్రత్యేక. అందుకే ఈ సినిమా మహేశ్ కెరీర్ లోనే రికార్డు స్థాయిలో సందడి చేస్తోంది. మహేశ్ బాబు సినిమా అంటేనే టాలీవుడ్ కు అదో పెద్ద పండగ. థియేటర్లన్ని సందడిగా మారతాయి. అది మహేశ్ బాబు మానియా. కానీ భరత్ అనే నేను ఇంకాస్త సందడి పెంచింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కడంతో..సినిమాపై విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. పైగా ఇందులో మహేష్ సీఎంగా కనిపించడం,,అందులోను సామాజిక కోణం టచ్ చేసే ఇష్యూ కావడంతో..ప్రతి ఒక్కరి ద్రుష్టిని ఆకర్షిస్తోంది.


బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో రెండోసారి సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటారు. అలానే మహేశ్ కూడా. ఫస్ట్ టైం హిట్ ఇచ్చిన దర్శకుడిని నమ్మి పిలిచి మరీ రెండోసారి ఛాన్స్ ఇచ్చాడు.
‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, ఆ సినిమా తర్వాత మహేష్‌ నుంచి అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా రాలేదు. మరి ఈ శుక్రవారం విడుదలైన ‘భరత్‌ అనే నేను’ ఆ అంచనాలను అందుకుందా? మహేష్‌ కెరీర్‌లో మరో ‘శ్రీమంతుడు’ అయిందా? ముఖ్యమంత్రిగా మహేష్‌ ఏ మేరకు అలరించారు? అభిమానులకు ఇచ్చిన హామీని ‘భరత్‌..’ నెరవేర్చాడా?

కథ: భరత్‌ రామ్‌(మహేష్‌ బాబు)కు కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకే లండన్‌ ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీలు చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో తండ్రి రాఘవ(శరత్‌ కుమార్‌) మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. రాఘవ మృతిలో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు రాజకీయ గురువు వరద(ప్రకాశ్‌ రాజ్‌) భరత్‌ను సీఎంను చేస్తాడు. అదుపు తప్పిన ప్రజా జీవితాన్ని భరత్‌ తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే యత్నం చేస్తుంటాడు. భరత్‌ దూకుడు స్వభావం రాజకీయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ప్రజల నుంచే కాకుండా.. సొంత పార్టీ నుంచే కూడా ప్రతిఘటన ఎదురవుతుంటుంది. అయినా వాటన్నింటిని అధిగమించి భరత్‌ తన ప్రామిస్‌లను ఎలా పూర్తి చేస్తాడు? అన్నదే కథ.

నటీనటులు : భరత్‌ రామ్‌గా మహేష్‌ బాబు నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన కెరీర్‌లో మహేష్‌ క్లాస్‌ రోల్స్‌ చేసినప్పటికీ.. వాటిలో ఏదో వెలితిగా అనిపించేది. కానీ, భరత్‌గా ఓ ఛాలెంజింగ్‌ రోల్‌లో మహేష్‌ పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడు. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ చీఫ్‌ మినిస్టర్‌ పాత్రలో స్టైలిష్‌గా అలరించాడు. తన కెరీర్‌ బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు.

ఇక గాడ్‌ ఫాదర్‌ పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ మెప్పించాడు. ఇలాంటి పాత్రలను తాను తప్ప మరెవరూ పోషించలేనన్న రీతిలో ఆయన నటించాడు. వసుమతి పాత్రలో కైరా అద్వానీ బాగుంది. సీఎం భరత్‌ పర్సనల్‌ సెక్రటరీగా బ్రహ్మజీ.. పోసాని కామెడీ ట్రాక్‌లు ఆకట్టుకున్నాయి. శరత్‌ కుమార్‌, ఆమని, సితార, అజయ్‌, రావు రమేష్‌, దేవరాజ్‌, తమ పాత్రల మేర అలరించారు.

ఎలా ఉందంటే: ఇదొక పొలిటికల్‌ డ్రామా. దానికి మహేష్‌బాబు ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్‌ సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు. పొలిటికల్‌ డ్రామా అనేసరికి సందేశాలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు రాజకీయ నాయకుల మీద విమర్శలు.. ఉంటాయనుకుంటాం. అయితే వాటిని బలవంతంగా చొప్పించలేదు. రాజకీయ నేపథ్యం అంటే అంతా క్లాస్‌ టచ్‌ ఉంటుదనుకుంటే కూడా పొరపాటే. మాస్‌తో పాటు అన్ని వర్గాలు మెచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. భరత్‌ ముఖ్యమంత్రి అయ్యాక కథలో వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. సీఎంగా అతను తీసుకునే నిర్ణయాలు షాకింగ్‌గా అనిపిస్తాయి. వసుమతితో ప్రేమ కథ కావాల్సినంత వినోదాన్ని పంచింది. భరత్‌ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అలా అక్కడక్కడా వినోదాన్ని తనదైన శైలిలో మేళవించాడు దర్శకుడు. ‘భరత్‌ అనే నేను’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ వాడుకోవడం బాగుంది. విశ్రాంతి దగ్గరా పెద్ద మలుపులు ఏవీ లేవు.

ద్వితీయార్ధం పూర్తిగా మాస్‌కు నచ్చేలా తీర్చిదిద్దాడు. ‘రాచకోత’ నేపథ్యంలో సాగిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మహేష్‌ అభిమానులకు, యాక్షన్‌ ప్రియులకు తప్పకుండా నచ్చుతుంది. అక్కడి నుంచి కథ వేగమే మారిపోయింది. పాటలను, పోరాట దృశ్యాల్ని, మాస్‌ ఎలిమెంట్స్‌ని రాజకీయాల్ని, చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ ద్వితీయార్ధం సాగిపోతుంది. ప్రెస్‌మీట్‌ ఎపిసోడ్‌ మొత్తం క్లాప్స్‌ కొట్టిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న భావాలను ఈ సినిమా తాలుకూ ఆత్మని మహేష్‌ మాటల్లో చెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ సన్నివేశంలో సంభాషణలు ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను అద్దం పడతాయి. మీడియాను సైతం కార్నర్‌ చేస్తూ రాసుకొన్న డైలాగ్‌లు ఆలోచింపజేస్తాయి. పాటలను చక్కగా వాడుకున్నాడు దర్శకుడు. అవెక్కడా అడ్డుతగలవు. పతాక సన్నివేశాలకు ముందు ‘భరత్‌’ జోరు కాస్త తగ్గుతుంది. కానీ, ఇలాంటి కథలకు ఉండే ఇబ్బందే అది. మొత్తంగా చూస్తే ‘భరత్‌ అనే నేను’ పక్కా వాణిజ్యాంశాలతో మేళవించిన రాజకీయ చిత్రంగా మిగిలిపోతుంది.

సాంకేతికంగా.. ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. ‘భరత్‌ అనే నేను’, ‘వచ్చాడయ్యో సామి’ పాటలను సరైన టైమింగ్‌లో వాడుకున్నాడు దర్శకుడు. రెండూ హీరోయిజాన్ని అత్యున్నత స్థాయిలో చూపించే పాటలే. ‘వసుమతి’ పాటలో సాహిత్యం అర్థవంతంగా ఉంటుంది. మూడు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మరీ హింస, రక్తపాతం జోలికి వెళ్లకుండా క్లాస్‌ ప్రేక్షకులకు కూడా నచ్చేలా తెరకెక్కించాడు. రవి కె.చంద్రన్‌ కెమెరా పనితనం, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, సెల్వరాజన్‌ ఆర్ట్‌ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. నిర్మాణ విలువలు కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఖరీదైన చిత్రం ఇదే కావచ్చు. కొరటాల శివ మరోసారి కథకుడిగా, దర్శకుడిగా రాణించాడు. తనెప్పుడూ ఒక మంచి పాయింట్‌ను కమర్షియల్‌ హంగులు జోడించి చెబుతుంటాడు. ఈసారి అదే పంథాంలో వెళ్లి విజయవంతమయ్యాడు. గత మూడు చిత్రాలతో పోలిస్తే ‘భరత్‌ అనే నేను’ ఒక మెట్టుపైనే ఉంటుంది. కమర్షియల్‌ దర్శకుడిగా కొరటాల మరింత ఎత్తుకు ఎదిగినట్టే.

ఫ్లస్‌ పాయింట్లు :
మహేష్‌ బాబు
కథా-కథనం
పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌
మైనస్‌ పాయింట్లు:
- క్లైమాక్స్‌లో తగ్గిన వేగం

Next Story