ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు 57 ఏండ్లు నిండిన అందరికీ

x
Highlights

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికలు, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి...

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికలు, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగా 9 వేల 355 మంది గ్రామ కార్యదర్శుల నియామకంతో పాటు 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు, ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి గ్రామాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతీభవన్‌లో సీఎం కేసీఆర్‌ పంచాయితీరాజ్‌ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం 12 వేల 751 గ్రామాల్లో కార్యదర్శుల నియామకం కోసం కొత్తగా 9 వేల 355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ముగియడంతో నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

నూతనంగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి.. గ్రామాల రూపురేఖలు మార్చాలని కేసీఆర్‌ సూచించారు. పంచాయతి ఎన్నికల తర్వాత గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించాలని తెలిపారు. అలాగే కొత్తగా ఎన్నికైన గ్రామకార్యదర్శులు, ఎంపీడీవోలు, డీపీవోలు అంతా కలిసి ఈ నెల 27 న ఎల్బీ స్టేడియంలో అవగాహనా సదస్సు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ఆయన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక సూచనలు చేస్తారు.

మరో ఎన్నికల హామీ అయిన 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ పై విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సిఎస్ ను సీఎం ఆదేశించారు. 2019-20 బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి, ఏప్రిల్ నుంచి పెన్షన్లు అందివ్వాలని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సందర్భంగా ఆగిపోయిన బతుకమ్మ చీరల పంపిణీని ఈ నెల 19 నుంచి ప్రారంభించాలని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories