వైద్య రంగంలో అద్భుతం

x
Highlights

నవమాసాలు ఆగాకే ఓ బిడ్డ తల్లి కడుపులో నుంచి ఈ లోకంలోకి అడుగు పెడుతుంది. కానీ రకరకాల సమస్యల వల్ల నెలలు నిండకుండానే కొందరు ముందుగానే పుట్టేస్తున్నారు....

నవమాసాలు ఆగాకే ఓ బిడ్డ తల్లి కడుపులో నుంచి ఈ లోకంలోకి అడుగు పెడుతుంది. కానీ రకరకాల సమస్యల వల్ల నెలలు నిండకుండానే కొందరు ముందుగానే పుట్టేస్తున్నారు. అలా ఓ శిశువు 5వ నెలలోనే ఈ ప్రపంచంలోకి వచ్చేసింది. అసలు ఆరు, ఏడు..నెలలకు పుట్టినవారే బతికి బట్టకట్టడం కష్టం. మరి అలాంటిది 25 వారాలకు పుట్టిన బిడ్డ పరిస్థితి ఏంటి..? ఏదైనా అద్భుతం జరిగితేనే 5వ నెలలో పుట్టిన వారు బతుకుతారు. అలాంటి అత్యద్భుతమే హైదరాబాద్‌లో జరిగింది.

బిడ్డ పొడవు : 26 సెంటీ మీటర్లు...బిడ్డ బరువు : 375 గ్రాములు...హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జన్మించిన బిడ్డ పొడవు, బరువు ఇది. ఐదో నెలలో పుట్టిన పాప సరిగ్గా చెప్పాలంటే అర కిలో బరువు కూడా లేదు. పైగా ఆ బిడ్డను ఎత్తుకుంటే..చేతిలో ఐదవ వంతు పరిమాణం మాత్రమే ఉంది. ఆ పాప బతికే ఛాన్స్ కూడా ఒకశాతమే. అలాంటి శిశువును బతికించాలంటే కత్తిమీద సామే మరి.

మనం చూస్తున్న ఈ పాప పేరు చెర్రీ. తల్లిదండ్రులు ఛత్తీస్ గఢ్‌కు చెందిన సౌరభ్. నికిత. చెర్రీ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫిబ్రవరి 27న జన్మించింది. పొడవు 26 సెంటీ మీటర్లు బరువు 375 గ్రాములు. ఐదో నెలలో అంటే 25 వారాలకు పుట్టిన పాపకు ఆక్సిజన్ అందించడం ఆహారం ఇవ్వడం చాలా కష్టం. పైగా ఎన్నో ఆరోగ్య సమస్యలు. కానీ పాపకు వచ్చిన ఒక్కో ఆరోగ్య సమస్యను అధిగమించుకుంటూ 105 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక వైద్య పరికరాల ద్వారా చికిత్స అందించారు. పాప ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చి రెండు కిలోల బరువు పెరిగే వరకు 128 రోజుల పాటు వైద్యం చేశారు. అలా ఐదో నెలలో పుట్టిన బిడ్డను బతికించి ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు హైదరాబాద్ డాక్టర్లు.

పాప తల్లి నిఖితకు గతంలో నాలుగు సార్లు అబార్షన్ అయ్యింది. ఐదో సారి మాత్రమే గర్భం నిలిచింది. తీరా కడుపులో ఉమ్మనీరు తగ్గిపోవడంతో ఐదో నెలలోనే డెలివరీ అయ్యింది. పాప మీద ఆశలు వదులుకున్న సమయంలో డాక్టర్లు అద్భుతం సృష్టించి ఆ చిన్నారి ప్రాణాలు నిలబెట్టారు. పిల్లల మీద ఆశ చంపుకుంటున్న సమయంలో చెర్రీని కంటికి రెప్పలా కాపాడి అమ్మ పొత్తిళ్ళకు చేర్చారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. 375 గ్రాముల బరువుతో పుట్టిన చెర్రీ బతకడమే ఓ అద్భుతం అనుకుంటే అంత తక్కువ బరువుతో జన్మించి జీవించి ఉన్న వ్యక్తి ఆగ్నేయాషియాలో ఇదే ప్రధమం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories