ప్రచార హోరు...

ప్రచార హోరు...
x
Highlights

తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీల ప్రచారం కోసం ఢిల్లీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కీలక నేతలు రాష్ట్రానికి వస్తున్నారు....

తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీల ప్రచారం కోసం ఢిల్లీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కీలక నేతలు రాష్ట్రానికి వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రెండు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రాల్లో జరిగే ఈ సభలకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. నిజామాబాద్‌లో 12 గంటలకు, మహబూబ్‌నగర్‌లో 2.30 గంటలకు సభల్లో మోడీ ప్రసంగిస్తారు.

బీజేపీ నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలపై ప్రత్యేకంగా కన్ను వేసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ ప్రచారాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రారంభించారు. రాజ్‌నాథ్‌సింగ్‌ నిజామాబాద్‌ సభలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ సభలో మోడీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లోనూ పాలమూరుకు ప్రాధాన్యం ఇచ్చారు. డిసెంబరు 3న హైదరాబాద్‌లో మరో సభలో పాల్గొంటారు మోడీ. అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు చెరో రెండు సభల్లో మాట్లాడనున్నారు. స్మృతి ఇరానీ, గడ్కరీ, ఫడణవీస్‌ కూడా ప్రచారానికి వస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ రేపు, ఎల్లుండి తెలంగాణ ప్రచారంలో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల ఇద్దరూ కలిసి, కొన్నిచోట్ల విడివిడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాహుల్‌గాంధీ రేపు కొడంగల్‌, వికారాబాద్‌, ఖమ్మం సభల్లో, సికింద్రాబాద్‌, నాంపల్లి రోడ్‌షోలో పాల్గొంటారు. ఎల్లుండి హైదరాబాద్‌లో ప్రైవేటు విద్యాసంస్థల వారితో, భూపాలపల్లి, ఆర్మూరు సభల్లో పాల్గొంటారు. చేవెళ్లలో బస్తీ సమావేశంలో పాల్గొని, అక్కడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్తారు.

సికింద్రాబాద్‌ రోడ్‌షోలో రాహుల్‌, చంద్రబాబు కలిసి పాల్గొంటారు. ఎల్లుండి శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో చంద్రబాబు ప్రచారం చేస్తారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మంలో ప్రజాకూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇందులో రాహుల్‌, చంద్రబాబు పాల్గొంటారు. ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాల నుంచి వేర్వేరు హెలికాప్టర్లలో నేరుగా వచ్చి ఈ సభలో పాల్గొంటారు. ఉత్తమ్‌, కోదండరాం, సురవరం తదితరులు పాల్గొంటారు. నామా నాగేశ్వర్‌రావు, భట్టి విక్రమార్క ఈ సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

చంద్రబాబు రేపు సాయంత్రం, ఎల్లుండి రాజధాని నగరంలో, రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ నెల 30నుంచి డిసెంబరు 4వరకు తెలంగాణలో ప్రచారం చేస్తారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఒకరోజు ప్రచారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆమె నిర్మల్‌, శ్రీరాంపూర్‌, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ సభల్లో పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories