logo

నా మనసులో వారికి ప్రత్యేక స్థానం ఉంది: సీఎం జగన్

నా మనసులో వారికి ప్రత్యేక స్థానం ఉంది: సీఎం జగన్
Highlights

ఏపీకి కొత్త గవర్నర్‌‌ను నియమించడంతో ఇప్పటివరకూ పనిచేసిన నర్సిహన్‌కు గ్రాండ్ సెండాఫ్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ...

ఏపీకి కొత్త గవర్నర్‌‌ను నియమించడంతో ఇప్పటివరకూ పనిచేసిన నర్సిహన్‌కు గ్రాండ్ సెండాఫ్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ ఒకరిపై ఒకరు పొగడ్తలు ముంచెత్తారు. మరికొన్ని రోజులు ఏపీకి గవర్నర్‌గా కొనసాగి ఉంటే బాగుండేదని, తాను సీఎం అయ్యాక తండ్రి మాదిరిగా ముందుండి నడిపించారని జగన్ చెప్పగా జగన్ 30రోజుల పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రతి బాల్ బౌండరీ, సిక్సర్‌ను తాకుతున్నట్టు నరసింహన్ చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్ పాలన మరిన్ని సెంచరీలు కొట్టాలని కోరుకుంటున్నానన్నారు నరసింహన్.

తాను ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తానన్నారు గవర్నర్‌ నరసింహన్‌. తొమ్మిదిన్నరేళ్ల పాటు గవర్నర్‌గా పనిచేశానని.. తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే తనను క్షమించాలని కోరారు. ఏపీకి కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్‌ నరసింహన్‌కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏపీలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలని ఆకాంక్షించారు నరసింహన్‌. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు భావోద్వేగంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. 1951లో విజయవాడలోనే తన అక్షరాభ్యాసం జరిగిందని, అప్పట్లో విజయవాడలోని గవర్నర్‌పేటలో ఉండేవాళ్లమని నరసింహన్‌ గుర్తుచేసుకున్నారు. తనకు అహోబిలం నరసింహ స్వామి పేరు పెట్టారని.. ఈ రాష్ట్రానికి ఆ నరసింహుడి అండ ఎప్పుడూ ఉంటుందన్నారు. సీఎం జగన్‌ను తన కుమారుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. కెప్టెన్‌గా జగన్‌ నాటౌట్‌ కాకూడదని నరసింహన్‌ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నియమాల మేరకే శాసనసభ సమావేశాలు జరగుతున్నాయని చెప్పారు.

మరోవైపు సీఎం జగన్ గవర్నర్‌ నరసింహన్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఆయనతో తనకు పదేళ్ల పరిచయం ఉందని.. తండ్రిలా తనను ఆదరించారని చెప్పారు. గవర్నర్‌ నరసింహన్‌, విమల దంపతులను ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ దంపతులు సత్కరించారు. నరసింహన్‌కు వేంకటేశ్వరస్వామి ప్రతిమ జగన్‌ అందజేశారు. అనంతరం గవర్నర్‌ దంపతులను శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, పలువురు మంత్రులు, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, ఐఏఎస్‌ అధికారుల సంఘం తరఫున ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు సత్కరించారు.





లైవ్ టీవి


Share it
Top