బాబు మీటింగ్‌కు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు?

బాబు మీటింగ్‌కు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు?
x
Highlights

వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లు తెలుగుదేశానికి గుడ్‌ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ...

వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లు తెలుగుదేశానికి గుడ్‌ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ మీటింగ్‌కు 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, ఇప్పుడు హాట్‌ టాపికయ్యింది. ఇప్పటికే టీడీపీని ఖాళీ చేస్తామని బీజేపీ, రకరకాల వ్యూహాలు వేస్తున్న వైసీపీ, ఈ నేపథ్యంలో 10 టీడీపీ ఎమ్మెల్యేల డుమ్మా అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఇంతకీ బాబుతో మీటింగ్‌కు ఎవరెవరు రాలేదు ఎందుకు రాలేదు వీరిలో ఎందరు వంశీ బాటలో నడుస్తారని చర్చ జరుగుతోంది?

ఒకవైపు ఇసుక కొరతపై ప్రభుత్వ తీరుకు నిరసనగా చంద్రబాబు దీక్ష అదే రోజు టీడీపీ కీలక నేతలు, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లు పార్టీకి గుడ్‌ బై చెబుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రెండు అధికార పార్టీలు బీజేపీ, వైసీపీల వ్యూహాలతో, తెలుగుదేశం ఇప్పుడు అల్లాడిపోతోంది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లు పార్టీ వీడటంతో, చంద్రబాబు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టయ్యింది. రేపోమాపో ఉన్న 23 మందిలో అత్యధికులు జారిపోవడం ఖాయమన్న పరిణామాల నేపథ్యంలో, వంశీ, అవినాష్‌లు వెళ్లిపోవడంతో, బాబు మరుసటి రోజే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశానికి 23 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, ఇప్పుడు మరింత చర్చనీయాంశం కావడమే కాదు, బాబును మరింత టెన్షన్ పెడుతోంది. ఒకరోజు ముందే కీలక సమావేశమని చెప్పినా, వీళ్లెందుకు భేటికి రాలేదని చంద్రబాబు కూడా సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ బాబుతో మీటింగ్‌కు ఎవరెవరు రాలేదంటే.

1. బాలకృష్ణ, 2. బెండాలం అశోక్, 3. గంటా శ్రీనివాసరావు, 4. పిజివిఆర్ నాయుడు, 5. గద్దే రామ్మోహన్, 6. పయ్యావుల కేశవ్, 7. బుచ్చయ్య చౌదరి, 8. వాసుపల్లి గణేష్, 9. అనగాని సత్యప్రసాద్, 10. చినరాజప్ప

వీరిలో బాలకృష్ణ పార్టీని వీడే అవకాశం లేనేలేదు. అలాగే గద్దె రామ్మోహన్, పయ్యావుల కేశవ్, బుచ్చయ్య చౌదరి, సత్యప్రసాద్, చినరాజప్పలు, ఆరోగ్యం బాగాలేనందున సమావేశానికి రాలేమని చంద్రబాబుకు సమచారం పంపారట. మరి సమాచారం ఇవ్వకుండా, భేటికి డుమ్మాకొట్టింది ఎవరో తెలుసా గంటా శ్రీనివాస రావు, బెండాళం అశోక్, పిజివిఆర్ నాయుడు, వాసుపల్లి గణేష్. ఈ నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు మీటింగ్‌కు రావడంలేదని కనీసం చెప్పలేదని చర్చ జరుగుతోంది. దీంతో వీరు కూడా వంశీ బాటలోనే నడుస్తారా అన్న డిస్కషన్ కూడా మొదలైంది.

చెప్పాపెట్టకుండా మీటింగ్‌కు రానివారిలో సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఒకరు. ఎన్నికలైన నాటి నుంచి ఈ‍యన పార్టీ మారతారన్న ప్రచారం వుంది. వైసీపీలోకి వెళ్లడానికి రాజీనామా అడ్డుపడ్డంతో, ఇక చేసేదేమీ లేక మరో అధికార పార్టీ బీజేపీని ఎంచుకున్నారన్న చర్చ జరిగింది. కొంతకాలంగా పార్టీ కార్యకపాలకు కూడా గంటా అంటీముట్టనట్టుగానే వున్నారు. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేలా మొన్న ఏకంగా ఢిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు గంటా. అతిత్వరలో తనతో పాటు కొందర్నీ బీజేపీలోకి లాగి, అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్షం ఏర్పాటు చేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. వంశీ తర్వాత చంద్రబాబుకు షాకిచ్చేది గంటానేనని తెలుస్తోంది.

మొత్తానికి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన టీడీపీలో మరింత కల్లోలం రేపడానికి అధికార బీజేపీ, వైసీపీలు వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. సంక్షోభాలు టీడీపీకి కొత్తకాకపోయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం, అవి తీవ్రంగా ఉన్నాయని, భవిష్యత్తులో మరింత తీవ్రమవుతాయంటున్నారు. నాయకత్వ సంక్షోభం ఆందోళనతో పాటు ఐదేళ్లు అధికార పార్టీకి దగ్గరగా వుండి నియోజకవర్గంలో పనులు చేయించుకుని, ఎన్నికల నాటికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు చాలామంది పార్టీ మారుతున్నారని అర్థమవుతోంది. ఇందులో వ్యాపారాలు, వ్యక్తిగత అవసరాలు, బంధుప్రీతి కూడా కారణాలు కావొచ్చు. కారణాలు ఏవైనా, టీడీపీలో ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళితే, టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే, ప్రతి సంక్షోభమూ ఒక అవకాశమని చెప్పే ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారో, దీన్నొక అవకాశం మలచుకుని, కొత్త నాయకులను ఎలా తయారు చేస్తారో చూడాలి.


Keywords: Andhra Pradesh, TDP MLAs, Chandrababu Naidu, Nara Lokesh

Show Full Article
Print Article
More On
Next Story
More Stories