Top
logo

విశాఖలో మొదలైన నామినేటెడ్‌ పోస్టుల హడావుడి

విశాఖలో మొదలైన నామినేటెడ్‌ పోస్టుల హడావుడి
Highlights

ఏపీలో కొత్త ప్రభుత్వ కొలువుదీరింది. సీఎం జగన్ పదవుల పంపకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాప్ లేకుండా రోజుకో...

ఏపీలో కొత్త ప్రభుత్వ కొలువుదీరింది. సీఎం జగన్ పదవుల పంపకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాప్ లేకుండా రోజుకో సలహాదారును నియమిస్తూ ఎడాపెడా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దూకుడు మీదున్న ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపై దృష్టి పెట్టింది. దీంతో పదవి తమకు కావాలంటే తమకు అంటూ ఆశావహ నేతలంతా ఎవరికి వారే ప్రయత్నాలు షూరు చేశారు. విశాఖ నామినేటెడ్ పోస్టుల రాయబారాలపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ

ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల పందేరానికి రంగం సిద్ధమైంది. విశాఖలో నామినేటెడ్‌ పోస్టులను ఆశిస్తున్న ఆ పార్టీ నేతల్లో హడావిడి మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ 15 అసెంబ్లీ స్థానాలకు గాను పదకొండింటిని గెలుచుకుంది. అదేవిధంగా మూడు పార్లమెంట్‌ స్థానాలనూ కైవసం చేసుకుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి రావడంతో ఇప్పటివరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దొరకని నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు.

పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్‌ పోస్టుల ద్వారా న్యాయం చేస్తానని సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలోని పలువురు నేతలు స్థానికంగా వీఎంఆర్‌డీఏ చైర్మన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, సింహాచలం ట్రస్టు బోర్డు, మార్కెట్‌ కమిటీ పదవులతో పాటు రాష్ట్ర స్థాయిలో మత్స్యకార అభివృద్ధి శాఖ చైర్మన్‌, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌, జీసీసీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌, రాష్ట్ర మెడికల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటి కీలకమైన పోస్టులపై కన్నేశారు.

తమకు అనుకూలంగా వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్ద తమ మనసులోని మాటను చెప్పి తమ పేర్లను ప్రతిపాదించాలని కోరుతున్నారు. ఈ నెలలో కీలకమైన కొన్ని నామినేటెడ్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం వున్నదని పార్టీ వర్గాలు చెప్పడంతో ఆశావహుల్లో ఒక్కసారిగా హడావిడి మొదలైంది. ఎవరికి వారు త‌మ త‌మ అదృష్టాన్ని ప‌రిక్షించుకోవ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఎవ‌రు ఈ నామినేటెడ్ ప‌ద‌వుల‌ను సొంతం చేసుకుంటారో ఎదురు చూడాల్సిందే.


లైవ్ టీవి


Share it
Top