తిరుమల కొండపై స్నేహం చిగురిస్తుందా?

తిరుమల కొండపై స్నేహం చిగురిస్తుందా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహం చిగురిస్తున్న కొద్దీ కొత్తకొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధొరణి...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహం చిగురిస్తున్న కొద్దీ కొత్తకొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధొరణి అనుసరిస్తున్నారు. మొన్న జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ వెళితే, కాళేశ్వరం ప్రారంభానికి జగన్‌ను ఆహ్వానించబోతున్నారు గులాబీ దళాధిపతి. అయితే ఇదే ఒరవడిలో తిరుమల కొండపైనా సరికొత్త స్నేహం చిగురించాలని భావిస్తున్నారట ఇద్దరు సీఎంలు. ఇంతకీ కేసీఆర్-జగన్ స్నేహానికి తిరుమల కొండకూ లింకేంటి?

అఖిలాండ నాయకుని బ్రహ్మాండ దేవాలయం తిరుమల. ప్రతి ఏడాది కొన్ని కోట్ల మంది వేంకటేశ్వరున్ని దర్శించుకుంటారు. వెంకన్నకు కైంకర్యాలతో పాటు పాలనా వ్యవహారాలు చూసే సంస్థ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం.

ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారిపోతుంటాయి. సహజంగానే టీటీడీ పాలకమండళ్ల పాలకులు కూడా మారిపోతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు దిగిపోయి, వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువుదీరింది. కొండపై కొలువైన టీటీడీ నాయకగణం కూడా మారడం ఖాయం. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్‌ యాదవ్ దిగిపోవడం పక్కా. లేదంటే పాలకమండలినే రద్దు చేయడం గ్యారంటీ. టీటీడీ బోర్డు రద్దయితే ఇక అధికార పక్ష నాయకులకు కొండపై కొలువుల మేళానే. అయితే, చిగురిస్తున్న స్నేహం సాక్షిగా తెలంగాణకూ టీటీడీలో భాగస్వామ్యం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

టిటిడి బోర్డు ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నారు గులాబీ నేతలు. జగన్-కెసిఆర్ ఇద్దరూ మంచి అండర్‌స్టాండింగ్‌‌గా ఉండడంతో, తెలంగాణకు రెండు టీటీడీ పదవులు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్‌ నేతలు ఆ రెండు పదవుల కోసం, గులాబీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.

కేసీఆర్ ఎవరిని సూచిస్తే వారికే టీటీడీలో సభ్యత్వం లభిస్తుందనే చర్చ గులాబి పార్టీలో సాగుతోంది. ఈ రెండు సభ్యత్వాల కోసం పెద్దఎత్తునే నేతలు పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి వైసిపి మాజీ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దక్కనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. పొంగులేటికి జగన్మోహన్ రెడ్డికి మద్య ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు టికెట్ పొంగులేటికి దక్కలేదు. కేసీఆర్ మాత్రం పొంగులేటిని రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలో ఉన్నట్లు, ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డికి హామీ కూడా ఇచ్చారని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే, అదే ఖమ్మం జిల్లాకు చెందిన చెరుకు కరణ్ రెడ్డి ఈ రేసులో ఉన్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది.

అటు జగన్‌కు ఇటు కేటీఆర్‌కు సన్నిహితుడు చెరుకు కరణ్. ఇదాయనకు కలిసొచ్చే అంశం. 2014 నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా బాధ్యతలను కరణ్ రెడ్డి చూస్తున్నారు. అంతకుముందు జగన్ సోషల్ మీడియా కోసం కూడా పని చేశారు కరణ్. ఈ సంబంధాలే తిరుమల కొండపై కొత్త బాధ్యతలు అప్పగిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు కరణ్.

ఇక కరణ్ రెడ్డితో పాటు మరో వ్యక్తికి కూడా ఒక పదవి వచ్చే ఛాన్సుంది. ఎవరైనా ఎమ్మెల్యేకు టీటీడీ మెంబర్షిప్ దక్కే అవకాశం ఉంది. అందులో వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేరు చర్చలో వినిపిస్తోంది. నరేందర్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఖాయమని ఆయన అనుచరులు కూడా కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. ప్రస్తుతం అదే సత్తుపల్లి చెందిన చెరుకు కరణ్ రెడ్డికి సత్తుపల్లి సెంటిమెంట్‌తో మరోమారు అక్కడి నేతకే అవకాశం వస్తుందనే ఆశగా ఉన్నారు. ఇటు నన్నపనేని, అటు కరణ్ ఇద్దరూ ఈ పదవుల కోసం అప్పుడే కేటీఆర్‌తో మనసులో మాట చెప్పుకున్నారట.

మొత్తానికి తెలంగాణ నుంచి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇద్దరికి ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. ఒకవేళ జగన్‌ ప్రభుత్వం అవకాశమిస్తే, గులాబీ బాస్ ఎవరిని ప్రతిపాదిస్తారన్నదే ఉత్కంఠగా మారింది. అయితే కేసిఆర్ ఆలోచన మాత్రం రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఆధ్యాత్మిక గురువుకు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే కేసిఆర్ గౌరవించే తెలంగాణ పండితుల్లో ఎవరికైనా అవకాశం ఉండొచ్చు. చూడాలి కొండపై వెంకన్న సన్నిధిలో, తెలంగాణ నుంచి కొలువులో కుదురేదెవరో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories