తూర్పు గోదావరి మన్యంలో మరణ మృదంగం..

తూర్పు గోదావరి మన్యంలో మరణ మృదంగం..
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా మన్యంలో మరణ మృదంగం మ్రోగుతోంది. గిరిజనులు అంతుపట్టని రీతిలో అనారోగ్యంతో మృతి చెందుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా మన్యంలో మరణ మృదంగం మ్రోగుతోంది. గిరిజనులు అంతుపట్టని రీతిలో అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. కాళ్ల వాపు, కీళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధిత వంటి వ్యాధులతో గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి కారణం సకాలంలో వైద్యం అందుకే చనిపోతున్నారని గిరిజన సంఘాల నేతలు వాపోతున్నారు. గత కొద్ది రోజులలో మన్యంలోని చింతూరు, విఆర్ పురం మండలాల్లోని పలు గ్రామాలలో 14 మంది వరకూ మృత్యువాత పడ్డారు.

తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాలైనై చింతూరు, విఆర్ పురం మండలాల్లో అనేక గిరిజన గ్రామాలలో మరణ మృదంగం విన్పిస్తోంది. ఒక వైపు కరోనా వైరస్ భయం.. మరో వైపు కాళ్ల వాపులు, కిడ్నీ సంబంధ వ్యాధులు... కలవర పెడుతున్నాయి. కరోనాను జయించినా దీర్ఘకాలంగా వస్తున్న కాళ్ల వాపు వ్యాధిని మాత్రం గిరిజనులు జయించలేకపోతున్నారు. అయితే ఇందుకు వారి ఆహారపు అలవాట్లే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ మండలాలు ఖమ్మం జిల్లాలో వుండేవి. రాష్ట్ర విభజనతో ఈ మండలాలు తెలంగాణా నుంచి ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు మారాయి.

విలీన మండలాల్లో ఎన్నో సమస్యలతో ఓవైపు గిరిజనులు సతమవుతుంటే మరోవైపు కాళ్ళవాపు, కిడ్నీ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ఇందుకు ముఖ్యకారణం గిరిజనులు నాటుసారా..దానితో పాటూ ఇతర నకిలీ మత్తు ద్రవాలు సేవిస్తుండటం వల్ల అనారోగ్యం తలెత్తుతోందని వైద్యులు చెబుతున్నారు. పైగా నాటు సారా పూటుగా తాగి, అందుకు తగిన ఆహారం తినకపోవడం, నిల్వ చేసిన ఆహారం తినడం వంటి పరిస్థితులు వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. 2016లో విఆర్ పురం మండలం అన్నవరం గ్రామంలో కొద్దిరోజులు తేడాలో 10 మందికి పైగా కాళ్లవాపు వ్యాధితో చనిపోయారు. తరచూ ఇలాంటి మరణాలు సంభవిస్తూనే వున్నాయి.

వరుస మరణాలు పై స్పందించిన సిఎం జగన్ వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని ఆదేశించారు. కరోనా లాక్డౌన్ తో ఆ గ్రామాలకు అధికారులెవ్వరూ వెళ్లని పరిస్థితి. అయినా మంత్రి ఆళ్లనాని పర్యటించి పెదశీతన పల్లె లో కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన వ్యక్తి కుంటుంబానికి పరామర్శించారు.. ఆ మరుసటి రోజునే మరో వ్యక్తి చనిపోయాడు. పెద సీతానపల్లి గ్రామంలో ఒక నెలలోనే 7 గురు కాళ్ళ వాపుతో మృత్యువాత పడ్డారు. గిరిజనులలో కాళ్లవాపు, కిడ్ని వ్యాధులను నివారించడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని మంత్రి ఆళ్ల నాని ఆరోపించారు.స్పాట్..

తూర్పుగోదావరి మన్యంలోని చింతూరు, విఆర్ పురం మండలాల్లోని అనేక గ్రామాలలో 270 మంది వరకూ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ఇందులో 103 మంది గిరిజనుల అనారోగ్యం విషమించిందని మంత్రి ఆళ్లనాని దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు.దాంతో వీరందరినీ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని మంత్రి ఆదేశాలిచ్చారు. వారిలో 26 మందిని అంబులెన్స్ లో కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఇపుడు ఆ రెండు మండలాల్లో హెల్త్ ఎమర్జన్సీ పరిస్థితిని ప్రకటించారు.ప్రతి రెండు, మూడు గ్రామాలకు ఒక క్లినిక్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు అంబులెన్స్ లు వీరికోసం కేటాయించారు. ప్రతి గ్రామంలోనూ సర్వే నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. పరిస్థితి విషమించిన కొందరిని కాకినాడ చేర్చినప్పటికీ, చాలా మంది గ్రామాల్లోనే వున్నారు. మరికొందరికి చింతూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అనారోగ్యంతో వున్న గిరిజనులను కాపాడేందుకు సిఎం జగన్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని, త్వరలోనే చింతూరులో డయాలిసిస్ యూనిట్ ప్రారంభిస్తామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి సబ్ సెంటర్ ఏర్పాటు చేసి విలీన మండలాల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటాం అన్నారు.

ఏజెన్సీలో కాళ్ల వాపు కేసులు ఈ మధ్య పెరిగాయని కేవలం నాలుగు ప్రాధమిక కేంద్రాల పరిధిలో103 కేసులు వచ్చాయని చింతూరు డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ పద్మజ అంటున్నారు. ఎక్కువగా రక్త హీనత, కాళ్లవాపు , హిమోగ్లోబిన్ తక్కువగా వుండటం, పౌష్టీకాహారం లేకపోవడం వంటి సమస్యలే గిరిజనుల మరణాలకి కారణాలని ఆమె చెప్పారు.

విఆర్ పురం మండలం అన్నవరం నుంచి కాళ్లవాపు వ్యాధి విస్తరించిందని, అర్నెళ్లుగా ఇదే పరిస్థితి వుందని బిజేపీ నేత డివిఎస్ రమణారెడ్డి చెప్పారు. చింతూరు ఆస్సత్రిలో సరైన వసతులు లేవు, డయాలిస్ సెంటర్ లేదని, కరోనా వ్యాధా, కాళ్లవాపు వ్యాధా అనేది తెలియడం లేదన్నారు. 45 మంది వరకూ చనిపోతే 15 మందికే పరిహారం ప్రకటించారని ఆయన అన్నారు. అలాగే ఆ ప్రాంతంలో మాజీ ఎమ్మల్యే సున్నం రాజయ్య పర్యటించారు. మొత్తం మీద ఏజెన్సీలో మరణ మృదంగం మోగిస్తున్న కాళ్లవాపు వ్యాధి నివారణకు సర్కార్ నడుం బిగించింది. ఏళ్ల తరబడి ఈ బాధలనుఅనుభవిస్తున్న గిరిజనులకు జగన్ ప్రభుత్వంలోనైనా పరిష్కారం కనబడుతుందని ఆశిద్దాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories