టీటీడీ నిరర్ధక ఆస్తుల వేలం ప్రక్రియపై రాజకీయ దుమారం

టీటీడీ నిరర్ధక ఆస్తుల వేలం ప్రక్రియపై రాజకీయ దుమారం
x
Highlights

శ్రీవారి భూముల వివాదం.. మరింత రాజుకుంది. నిరర్థక ఆస్తుల పేరుతో భూముల వేళం నిర్ణయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని...

శ్రీవారి భూముల వివాదం.. మరింత రాజుకుంది. నిరర్థక ఆస్తుల పేరుతో భూముల వేళం నిర్ణయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని ఇలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలంటూ టీడీపీ, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

నడి వేసవిలో టీటీడీ భూముల వేళం ప్రక్రియ రాష్ట్రంలో భగభగలు సృష్టిస్తోంది. భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించిన భూములను వేలం వేస్తామంటూ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. తమిళనాడులో శ్రీవారి స్థిరాస్తులను విక్రయించడానికి ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహించడానికి ప్రతిపాదనలను పాలకమండలి రూపొందించింది. మొత్తం 23 ప్రాంతాల్లో ఉన్న వ్య‌వ‌సాయ భూములు, ప్లాట్లను విక్రయానికి ఉంచబోతోంది. తిరువ‌ణ్ణామ‌లై, తిరుచిరాప‌ల్లి, తిరుచ్చి, తిరువ‌ళ్లూరు, ధ‌ర్మ‌పురి, విల్లుపురం, కంచి, కోయంబ‌త్తూరు, వెలూరు, నాగ‌ప‌ట్టణం జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో శ్రీవారికి సంబంధించిన భూములు ఉన్నట్లు గుర్తించింది. వీటిని వేలం వేసే ప్రక్రియ కోసం 8 మంది అధికారుల‌తో రెండు కమిటీల‌ను కూడా నియ‌మించింది. వీటి వేలం ద్వారా సుమారు 200 కోట్లను ఆర్జించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఫిబ్రవరిలో తీసుకున్న ఈ నిర్ణయమే ప్రస్తుతం రాజకీయ దుమారానికి తెరలేపింది. దేవాలయ ఆస్తుల జోలికి వస్తే ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ మంగళవారం ఇళ్లల్లోనే ధర్నా చేస్తామన్నారు. జీవో 39, టీటీడీ, సింహాచలం భూముల కోసం పోరాడతామని స్పష్టం చేశారు.

ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ ఈ అంశంపై మెగాబ్రదర్‌ నాగబాబు ట్వీట్ చేశారు. నీ ఆస్తులు నీవే రక్షించుకో అంటూ స్వామివారికి చెబుతున్నట్లుగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా తప్పుపట్టడమే టీడీపీ పనిగా మారిందని విమర్శించారు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు. హిందూ ధర్మాన్ని దెబ్బతీసేలా తమ ప్రభుత్వం ఎన్నడూ వ్యవహరించబోదని చెప్పుకొచ్చారు.

గత పాలకుల నిర్ణయాన్నే తాము అమలు చేస్తున్నామని తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు వద్దని హితవు పలికారు.

1990లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు తాము నిరర్ధక ఆస్తులను విక్రయించడానికి పూనుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దేవ‌స్థానం ఆస్తుల‌ను విక్రయించ‌డం లేదా లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయని చెప్పారు. బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories