విశాఖ ఘటన విషయంలో కేంద్రం సత్వరం స్పందించింది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

విశాఖ ఘటన విషయంలో కేంద్రం సత్వరం స్పందించింది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
x
Highlights

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై కేంద్రం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించింది. అత్యంత వేగంగా స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో...

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై కేంద్రం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించింది. అత్యంత వేగంగా స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వెనువెంటనే ఆసుపత్రులకు తరలించారు. NDRF తో పాటు SDRF, CISF, INDIAN NAVY సహాయక చర్యల్లో పాల్గొన్ని ప్రమాద తీవ్రతను నిరోధించగలిగారు. ప్రధాని మోడీ ఆదేశాలతో మరింత అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఏపీ ప్రభుత్వానికి అండగా నిలిచింది.

విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువులు వెలువడిన ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌కు ఫోన్‌ చేశారు. దుర్ఘటన వివరాలను జగన్ ‌ప్రధానమంత్రికి వివరించారు. తీసుకున్న సహాయ చర్యలను కూడా ఆయనకు తెలియజేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని వెల్లడించారు.

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఉదంతంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ విపత్తు నిర్వహణ బలగాలతో సమావేశం అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పరిస్థితిని సమీక్షించించారు. విశాఖపట్నంలో కొనసాగుతోన్న సహాయక చర్యలపై ప్రధాని ఆరా తీశారు. సమగ్ర నివేదికను తెప్పించుకున్నారు. ఈ నివేదిక సహా, మున్ముందు తీసుకోవాల్సిన చర్యల పైనా ప్రధాని.. జాతీయ విపత్తు నిర్వహణ అధికారులతో చర్చించారు.

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి తాను కూడా హాజరయ్యానని కిషన్ రెడ్డి వెల్లడించారు. విశాఖలో పరిస్థితి చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని సహకారాలను ఇవ్వాల్సిందిగా మోడీ ఆదేశించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. విశాఖలో లీకైన విషవాయువు ప్రభావాన్ని తగ్గించేందుకు న్యూట్రలైజర్ కెమికల్‌ను గుజరాత్‌‌కు చెందిన ఓ కంపెనీ నుంచి ఘటనా స్థలానికి తరలించినట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. విశాఖలో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు నెమ్మదిగా కోలుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories