నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేశా: రంగనాయకమ్మ

నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేశా: రంగనాయకమ్మ
x
Highlights

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఏపీ సర్కార్‌ కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవడంతో సీఐడీ...

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఏపీ సర్కార్‌ కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవడంతో సీఐడీ ఐటీ చట్టం కింద వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు.

తాజాగా విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం విఫలమైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలిపై కూడా కేసు నమోదు చేసింది సీఐడీ. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి.

గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన ఆరవై ఏళ్ల వృద్ధురాలు రంగనాయకమ్మపై సీఐడీ కేసు నమోదు చేసింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రంగనాయకమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వైరల్ కావడంతో అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి రంగనాయకమ్మకు నోటీసులిచ్చారు.

సీఐడీ నోటీసులపై స్పందించిన రంగనాయకమ్మ తన అభిప్రాయాన్ని మాత్రమే పంచుకున్నానని తెలిపారు. ప్రభుత్వాన్ని తాను ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదన్నారు. తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలన్నదే తన కోరిక అని అన్నారు.

ఇక రంగనాయకమ్మపై కేసు నమోదు చేయటంపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ఆమెకు సంఘీభావంగా నిలిచిన నేతలు ఒక సాధారణ మహిళ తన అభిప్రాయం చెబితే కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ అహంకార పాలన, అణచివేత ధోరణితో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందంటూ మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి లోకేశ్ ట్వీట్‌ చేశారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో తప్పు కప్పిపుచ్చుకునేందుకే సాధారణ ప్రజలపై కేసులు నమోదు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఇలాంటి చర్యలను ఖండించాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories