గ్రహణం 'పట్టని' కాళహస్తీశ్వరుడు!

గ్రహణం పట్టని కాళహస్తీశ్వరుడు!
x
Highlights

గ్రహణం అనగానే రాహువు మింగేస్తాడు.. కేతువు తినేస్తాడు.. అని చెబుతారు.

గ్రహణం అనగానే రాహువు మింగేస్తాడు.. కేతువు తినేస్తాడు.. అని చెబుతారు. నక్షత్రాలు..రాశులు అంటూ బయటకు వెళ్లకూడదని పెద్ద జాబితా చెబుతారు. అంతెందుకు గ్రహణం అనగానే దేవుడి సేవలూ బంద్! అన్ని ఆలయాలకు సెలవు ఇచ్చేస్తారు. 365 రోజులూ భక్తుల కోర్కెలు వినడంతో బిజీగా ఉండే దేవునికి చంద్రగ్రహణమో..సూర్యగ్రహణమో వస్తే ఇక రెస్ట్ అంతే! కానీ, ఒక్క దేవునికి మాత్రం ఆ అవకాశమూ లేదు. ఆయనే శ్రీ కాళహస్తీశ్వరుడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా.. అందుకే కాబోసు గ్రహణం కూడా అయన ఆనతి తోనే జరగుతుందని మీరనుకుంటున్నారా? అది పొరపాటు.. అసలు గ్రహణ సమయంలో ఆలయాలన్నీ మూసివేసినా ఈ వాయులింగేశ్వరుడిని మాత్రం దర్శనార్థం ఎందుకు విడిచి పెడతారో తెలుసా? ఇవిగో ఆ వివరాలు..

సూర్య చంద్రులను రాహు కేతువులు మింగడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని, అలా మింగడం వలన అరిష్టం కలుగుతుందని అంటుంటారు. ఈ సమయంలో భూమిపై చెడు కిరణాలు ప్రసరిస్తాయని, అవి ఆలయాలపై పడితే అశుభమని భావిస్తారు. అందుకోసమే చంద్రగ్రహణం, సూర్య గ్రహణం సమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాలు మూసివేస్తారని పెద్దలు చెపుతుంటారు. అంతే కాదు ఇలా రాహు, కేతులు సూర్యచంద్రుల్ని మింగే సమయంలో రాహు కేతుల శక్తి ప్రభావం వలన దేవతల శక్తి సన్నగిల్లుతుందని అంటుంటారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవతా మూర్తుల శక్తి క్షీణించకూడదనే ఆలయాన్ని మూసేస్తారని పండితులు చెబుతారు.

ఈ శంకరుడి దారే వేరు!

ఇక అన్ని దేవాలయాలను మూసేసే సమయంలో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ కాళహస్తి దేవాలయాన్ని మాత్రం మూసివేయరు. అంతే కాదు ఈ ఆలయాన్ని గ్రహణం పట్టని దేవాలయంగా కూడా పిలుస్తారు. అన్ని దేవాలయాలు గ్రహణకాలంలో మూసేసినప్పటికీ వాయులింగేశ్వరస్వామి ఆలయంలో మాత్రం ప్రత్యేకపూజలను నిర్వహిస్తుంటారు. అసలు ఈ ఆలయం ఎందుకు అన్ని ఆలయాల్లో భిన్నంగా ఉంటుందంటే..

శ్రీ కాళహస్తిలోని మహాశివుడిని వాయులింగేశ్వరస్వామిగా పిలుస్తారు. వాయువు అంటే ప్రాణం. సకల చరాచర జీవులు బతికుండేదే ఈ వాయువుతో. ఈ వాయువు లేకపోతే జీవులు శూన్యంలోకి వెలతాయి. అలాగే ఈ క్షేత్రం కూడా వాయువంతటి గొప్పది.

ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే సూర్య చంద్రులు, అగ్ని భట్టారకుడు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 9గ్రహరాశులున్న కవచంతో ఈ ఆలయం నిర్మితమైనది. ఈ కవచాన్ని ఆలయంలో శివలింగపైన ఏర్పాటు చేసారు. ఇందు వలన సౌరవ్యవస్థ అంతా అక్కడే ఉంటుందనేది గ్రహించవలసిన విషయం. ఈ సౌరవ్యవస్థ శక్తితో రాహువు, కేతువులు ఈ ఆలయంలోనికి ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టుగా ఆలయంలో దేవుని అదుపాజ్ఞల్లోనే గ్రహణ కిరణాల కదలికలు ఉంటాయని ప్రతీతి. అందువలన ఆ ఆలయాన్ని గ్రహణాలు ఏమి చేయలేవని భక్తుల ప్రగాఢ నమ్మకం.

అంతేకాదు ఈ ఆలయంలో గ్రహణ సమయంలో రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. నవగ్రహ కవచం ఉండడం వలన గ్రహన సమయంలో ఆలయ దైవశక్తి క్షీణించదని చెబుతుంటారు.

గ్రహణం సమయంలో ఎవరైతే ఈ ఆలయంలో పూజలు చేస్తారో వారి కోరికలను బోళా శంకరుడు తీరుస్తాడని అంటుంటారు. ఈ నమ్మకంతోనే గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాహుకేతు పూజలు చేస్తుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories