ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించిన అనితాబాయ్

ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించిన అనితాబాయ్
x
Highlights

ఆత్మవిశ్వాసంతో ఆమె అంగవైకల్యాన్ని జయించింది. పుట్టుకతో చేతులు లేకపోయినా కాలితో కలం పట్టింది. తోడబుట్టు తోడ్పాటుతో అటు చదువులో ఇటు చిత్రలేఖనంలోనూ...

ఆత్మవిశ్వాసంతో ఆమె అంగవైకల్యాన్ని జయించింది. పుట్టుకతో చేతులు లేకపోయినా కాలితో కలం పట్టింది. తోడబుట్టు తోడ్పాటుతో అటు చదువులో ఇటు చిత్రలేఖనంలోనూ రాణిస్తోంది. ఎర్ర బస్సు ముఖం ఎరుగని తండాలో పుట్టినా ఎవరికీ తీసిపోనని నిరూపిస్తోన్న ఆ చదువుల తల్లిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

కాలి వేళ్లతో కలం పట్టుకుని అక్షరాలు రాస్తున్న ఈమె పేరు అనితా బాయ్. పుట్టుకతోనే విధి ఈమెను వెక్కిరించింది. చేతులు లేని అనితను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బిడ్డ భవిష్యత్తుపై పుట్టెడు బెంగతో కుంగిపోయారు. అయితేనేం అంతులేని ఆత్మవిశ్వాసం, సోదరి సాయంతో ఆమె వైకల్యాన్ని ఓడిస్తోంది.

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గిరిజన తండాలో కృష్ణా నాయక్ దంపతులకు తొలి సంతానంగా జన్మించింది అనితా బాయి. ఆమెకు ఇద్దరు చెల్లుళ్లు, ఓ తమ్ముడు ఉన్నారు. అనితా చెల్లెలు లలితా బాయి అక్కను ఏనాడు భారంగా చూడలేదు. ఆమె వైకల్యం పట్ల చింతించలేదు. ఆమె ఆత్మవిశ్వాసానికి అండగా నిలుస్తోంది. సోదరితో పాటు తల్లిదండ్రుల సాయంతో కాళ్లనే చేతులుగా మలచుకుంది. అదే వేళ్లతో కుంచె పట్టింది. సాధారణ విద్యార్ధులకు పోటీ ఇస్తూ చుదువులోనూ రాణిస్తోంది. చిత్రలేఖనంలో అద్భుతాలు సృష్టించే ప్రావిణ్యాన్ని కుంచెతో సాధించింది అనితాబాయ్.

ప్రస్తుతం ఆలూరు కస్తూర్బా గాంధీ బాలకోన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకున్న అనితా బాయి తరగతిలో తోటి విద్యార్థులందరికీ పండుగలు పబ్బాలకు తానే గోరింటాకు పెడుతుంది. ఒక చదువు, చిత్రలేఖనంతోనే అనితా బాయి ఆగిపోలేదు. క్రీడల్లోనూ ఉన్నత స్థానాలకు వెళ్లాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. రెండు చేతులు లేని కారణంగా మైదానంలో అడుగుపెట్టే పరిస్థితి లేని అనితా బాయ్ అదే కాలి వేళ్లతో క్రీడాల్లోనూ రాణిస్తోంది.

అనితాబాయ్ విజయం వెనుక ప్రతి అడుగులో ఆమె సోదరి లలితా బాయి ఉంది. సోదరి వైకల్యాన్ని జయించడంలో లలితాబాయి చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఓ వైపు తన విద్యాభ్యాసం సాగిస్తూనే మరోవైపు తల్లిగా, తండ్రిగా సోదరి సంరక్షణ బాధ్యతలు స్వీకరించింది. అక్క కోసం అదే పాఠశాలలో చదువుతూ ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు సకల సపర్యలు చేస్తూ తన చదువును కొనసాగిస్తోంది లలితా బాయి. అందుకే చెల్లే తనకు తల్లి,తండ్రి అంటోంది అనితా బాయి.

అవయవాలు అన్నీ ఉన్నా చదువుల పట్ల మక్కువ చూపని ఎంతో మంది విద్యార్థులకు అనితా బాయ్ ఆదర్శంగా నిలుస్తోంది. మిగిలిన వారికి ఏ మాత్రం తీసిపోకుండా అందరిలోనూ తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్న అనితా బాయ్ కి ఎవరైనా దాతలు పెద్ద మనసుతో సాయం చేస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తుందని ఉపాధ్యాయులు ధీమాగా చెబుతున్నారు. తాజాగా కరోనా నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు రద్దు కావడంతో తన ప్రతిభను చాటుకోలేకపోయాను అన్న బాధ తనను తీవ్రంగా కలచివేస్తోందని అంటోంది అనితాబాయ్. తన ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువులపై మరింత దృష్టి సారిస్తానని ధీమాగా ఉంది.

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోంది అనితా బాయ్. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, తన శరీరం సహకరించకపోయినా తల్లితండ్రులు ఇస్తున్న ప్రోత్సాహంతో ఎన్నో అద్భుతాలు చేస్తున్న ఈ చదువుల తల్లికి ఎవరైనా దాతలు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు బంధువులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories