అమ్మకాలు లేవు.. ఆదుకునే వారు లేరు : కొయ్యబొమ్మల కార్మికులపై కరోనా ఎఫెక్ట్

అమ్మకాలు లేవు.. ఆదుకునే వారు లేరు : కొయ్యబొమ్మల కార్మికులపై కరోనా ఎఫెక్ట్
x
Highlights

కొయ్యబొమ్మల తయారీలో ఆ గ్రామాలది ఘనమైన చరిత్ర. హస్తకళా క్షేత్రంలో అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారికి పేరు, ప్రఖ్యాతలు తేవడంలో ఆ గ్రామాల కళాకారులదే కీలక...

కొయ్యబొమ్మల తయారీలో ఆ గ్రామాలది ఘనమైన చరిత్ర. హస్తకళా క్షేత్రంలో అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారికి పేరు, ప్రఖ్యాతలు తేవడంలో ఆ గ్రామాల కళాకారులదే కీలక పాత్ర. ఇంత ఘనమైన చరిత్ర ఉన్న కొయ్యబొమ్మల తయారీ కార్మికులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో అమ్మకాలు లేక ఆదుకునే వారు లేక విలవిల్లాడిపోతున్నారు. కడప జిల్లాలోని లక్ష్మీగారిపల్లె, శెట్టిగుంట గ్రామాలకు చెందిన కొయ్యబొమ్మల కళాకారుల కష్టాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

కడప జిల్లా రైల్వేకోడూరు సమీపంలోని లక్ష్మీగారిపల్లె, శెట్టిగుంట గ్రామాలు కొయ్య బొమ్మల తయారీకి ప్రసిద్ధి. ఆ గ్రామాలకి వెళ్తే కొయ్యబొమ్మలను చెక్కుతున్న సమయంలో ఠక్- ఠక్ మనే శబ్దం లయబద్ధంగా గాలిలో నాట్యం చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది. చీర్ణాలతో చెక్కుతున్నప్పుడు పచ్చి చెక్క వాసన అలలు అలలుగా నాసికాపుటాలను తాకుతుంది. పక్క పక్కనే ఉండే ఈ రెండు గ్రామాల వాసులు కొయ్య బొమ్మలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ కళకు సుమారు శతాబ్దం చరిత్ర ఉంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల వద్ద భక్తులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో వివాహాల సమయంలో ఈ కొయ్య బొమ్మలను నూతన వధూవరులకు కానుకలుగా ఇస్తుంటారు.

అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఆ రెండు గ్రామాల కొయ్యబొమ్మల కార్మికులను కరోనా రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోడంతో బొమ్మలు అమ్ముకునేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో 70 రోజులుగా కొయ్య బొమ్మలన్నీ మూలన పడిపోవడంతో ఇదే కళపై ఆధారిపడి జీవిస్తున్న దాదాపు 250 కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రస్తుతం వారంతా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నదంతా కొయ్యబొమ్మల తయారీకి ఖర్చు చేశామని ప్రస్తుతం అమ్మకాలు లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వలేక రోజు వారి జీవనమే కడు భారంగా మారిందని వారు వాపోతున్నారు.

అయితే ఇంతటి విపత్తులో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తమను ఎవరూ ఆదుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యవసర సరుకులు కొనడానికి కూడా సరిపడా డబ్బు లేదని ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories