Top
logo

తమ్మినేని స్పీకర్ అయితే..అచ్చెన్నాయుడికి కడుపు మంట: రోజా

తమ్మినేని స్పీకర్ అయితే..అచ్చెన్నాయుడికి కడుపు మంట: రోజా
Highlights

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరు పక్షాలు ఒకదానిపై ఒకటి మండిపడ్డాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో చెవిరెడ్డి వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా సభలో మాట్లాడుతూ స్పీకర్‌గా ఎన్నికైనందుకు తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపారు. ఎక్కడైనా మంచి చెడుల గురించి మాట్లాడేటప్పుడు గతాన్ని ఉదాహరణగా తీసుకుంటామని ఈ రోజు సభలో కొందరు చెప్పిన మాటల విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారో తనకు అర్థంకావట్లేదన్నారు. స్పీకర్‌ కుర్చీని అవమానించడం, దాన్ని దుర్వినియోగ పరచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గతంలోలా ఇప్పుడు కూడా స్పీకర్‌ను చంద్రబాబు అగౌరవపరుస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వంలో తనపై ఏడాదిపాటు స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసి అత్యున్నత స్థానాన్ని దుర్వినియోగం చేశారని రోజా ఆరోపించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ వల్ల మహిళలు పడుతున్న బాధల గురించి ప్రశ్నించిన తన గొంతును నొక్కేందుకు స్పీకర్ పదవిని వాడుకున్నారని రోజా అన్నారు. సుప్రీం కోర్టు తనకు అనుకూలంగా తీర్పునిచ్చినా తనను సభలోకి రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వాళ్లు విలువల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని రోజా విమర్శించారు. ఇక తమ జిల్లా వాసి స్పీకర్ అయితే సంతోషకంటే అచ్చెన్నాయుడికి కడుపుమంటే ఎక్కువగా ఉన్నట్టు ఆయన మాటల్లో కనబడుతోందని విమర్శించారు. సభాపతి స్థానం తండ్రి స్థానం లాంటిదని, తండ్రి తన పిల్లలందరినీ ఎలా సమానంగా చూస్తారో అలాగే సభ్యులందరినీ సమానంగా చూడాలని స్పీకర్‌ను కోరారు రోజా. ప్రజాసమస్యలపై మాట్లాడే అవకాశం అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

Next Story