జూరాల నుంచి దిగువకు 10 లక్షల క్యూసెక్కుల విడుదల ...

జూరాల నుంచి దిగువకు 10 లక్షల క్యూసెక్కుల విడుదల ...
x
Highlights

బిరబిర కృష్ణమ్మ పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయనే .. శంకరం బాడి సందరాచారి గేయాన్ని నిజం చేస్తూ జూరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కృష్ణమ్మ...

బిరబిర కృష్ణమ్మ పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయనే .. శంకరం బాడి సందరాచారి గేయాన్ని నిజం చేస్తూ జూరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇరవై రోజుల క్రితం వరకు చుక్క నీటి కోసం ఎదురు చూసిన సాగు నీటి ప్రాజెక్టులన్నీ జలకళతో కళకళలాడుతున్నాయి. జూరాల నుంచి పరుగులు పెట్టిన కృష్ణమ్మతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్ధాయి నిల్వ సామర్ధ్యానికి చేరుకుంది. మొత్తం 215 టీఎంసీలకు గాను .. 182 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది. మరో ఆరు అడుగుల నీటి మట్టం పెరిగితే ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్‌కు చేరుకోనుంది. కృష్ణమ్మ పరవళ్లో కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ప్రాజెక్టు పది గేట్లను 42 అడుగుల మేర ఎత్తి 8 లక్షల 40 వేల 450 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు .

నాలుగు రోజుల క్రితం డెడ్ స్టోరేజ్‌గా ఉన్న నాగార్జున సాగర్ .. ఇప్పడు జలకళ తొణికిసలాడుతోంది. ప్రాజెక్టు పరిధిలోని రైతుల కళ్లలో ఆనందం నింపుతూ కాల్వల్లో పరుగులు పెడుతోంది. 590 అడుగులకు గాను 572 అడుగులకు నీరు చేరుకోవడంతో .. రెండు పంటలకు ఢోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ప్రాజెక్టు పూర్తి స్ధాయి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలుగా కాగా .. ఇప్పటి వరకు 261 టీఎంసీల నీరు చేరినట్టు అధికారులు తెలియజేశారు. ఎగువ నుంచి వరద ఉదృతి కొనసాగుతూ ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 7 లక్షల 60 వేల 548 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ... 3 లక్షల 24 వేల 785 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.

జూరాల నుంచి శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్‌ను తాకిన కృష్ణమ్మతో పులిచింతల ప్రాజెక్టు కూడా కళకళలాడుతోంది. భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో ... తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ప్రాజెక్టుకు చెందిన 14 గేట్లను నాలుగు మీటర్ల ఎత్తి 3 లక‌షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు . 48 టీఎంసీల సామర్ధంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో రెండు రోజుల పాటు వరద ఉదృతి కొనసాగే అవకాశాలు ఉండటంతో .... పూర్తి స్ధాయి నిల్వ సామర్ధానికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పులిచింతల ముంపు గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories