Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ప్రైవేట్ స్కూల్ అరాచకం

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ప్రైవేట్ స్కూల్ అరాచకం
x
Highlights

ప్రైవేట్ స్కూళ్ల అరాచకాలు శృతిమించిపోతున్నాయి. ఫీజు చెల్లించలేదనే కారణంతో పసి పిల్లలని కూడా చూడకుండా పాఠశాల యాజమాన్యం బంధించింది.

ప్రైవేట్ స్కూళ్ల అరాచకాలు శృతిమించిపోతున్నాయి. ఫీజు చెల్లించలేదనే కారణంతో పసి పిల్లలని కూడా చూడకుండా పాఠశాల యాజమాన్యం బంధించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు గంటలు వారిని బంధీలుగా ఉంచారు. నాలుగు నుంచి ఐదేళ్ల వయసున్న చిన్నారులకు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా కర్కశత్వం చూపించారు. ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు అని భావించిన స్కూల్‌ను ఏకంగా జైలుగా మార్చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మలికిపురం మండలం గూడపల్లి శ్రీ వెంకట సత్యసాయి కాన్వెంట్ స్కూలు యాజమాన్యం ఫీజులు చెల్లించని చిన్నారులను నిర్భంధించింది. తల్లిదండ్రులు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో దారుణానికి పాల్పడ్డారు. స్కూలు ముగిసినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు తమ పిల్లలేరని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఫీజులు కట్టకపోవడంతో పిల్లలను ఉంచామని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు మండిపడ్డారు. స్కూల్‌ ఫీజులు వసూలు చేసే పద్దతి ఇదేనా అంటూ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గంటల తరబడి చీకటి గదుల్లోనే చిన్నారులను ఉంచారని... ఫీజు కట్టలేదని అభం శుభం తెలియని చిన్నారులను ఎలా శిక్షిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల్ని విడిచిపెట్టాలని ఎంత కోరినా.. యాజమాన్యం అంగీకరించలేదని.. దాదాపు ఐదుగంటల పాటు చిన్నారులను బంధించి ఉంచారని ఆవేదన చెందారు. కన్నవారు కనిపించకపోవడంతో చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గంటల తరబడి నిలబడి ఉండటంతో పాటు ఏం జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. చిన్నారుల పట్ల దారుణంగా ప్రవర్తించిన పాఠశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories