విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌లో నయా ట్విస్ట్

విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌లో నయా ట్విస్ట్
x
Highlights

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త మలుపు తీసుకోబోతోంది. హైదరాబాద్‌ తరహాలో నగరం మధ్యలో స్తంభాలు వేసి, దానిపై రైల్వే లైను వేయాలని అమరావతి మెట్రో రైలు...

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త మలుపు తీసుకోబోతోంది. హైదరాబాద్‌ తరహాలో నగరం మధ్యలో స్తంభాలు వేసి, దానిపై రైల్వే లైను వేయాలని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు చేసిన ప్రతిపాదనను విశాఖ అధికారులు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. విశాఖ అందం చేడిపోకుండా భూగర్భ మెట్రో రైల్‌కు మెుగ్గు చూపుతున్నారు.

విశాఖ ఓ అందమైన నగరం. పర్యాటకులు ఎక్కువగా వచ్చే స్మార్ట్ సిటీ. అంత అందమైన నగరంలో మెట్రో రైలు పేరుతో ఎక్కడికక్కడ స్తంభాలు వేసుకుంటూ పోతే ఆ అందమంతా పోతుందని, దానివల్ల అసలుకే మోసం వస్తుందని ఇక్కడి అధికారులు అంటున్నారు. వ్యయం ఎక్కువైనా కోల్‌కతా తరహాలో అండర్‌ గ్రౌండ్‌లో నిర్మించుకుంటే బాగుంటుందని, ఆ విధంగా ప్రణాళికలు మార్చుకుంటే మంచిదని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కొత్త ముఖ్యమంత్రికి చెప్పి ఒప్పించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు అధికారులు.

వాస్తవానికి ఈ ప్రాజెక్టు టెండర్‌ ఖరారుకు ఎన్నికల ముందే హడావిడిగా సంతకాలు పెట్టించాలని ఓ స్థాయి అధికారులు ప్రయత్నించారు. దానికి విశాఖలోని అధికారులు అంగీకరించలేదు. జర్మనీలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ చూడడానికి అంతా వెళదామని చెప్పిన అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు ఇక్కడి వారిని ఎవరినీ తీసుకుపోకుండా వెళ్లి వచ్చారు. మెట్రో రైల్ ప్రాజెక్ట‌కు ఓకే చేప్పారు. అయితే ఇక్కడ అధికారులు మాత్రం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు పరిశీలించి విశాఖకు భూగర్భ మార్గమే మేలు అని చెబుతున్నారు. స్తంభాలపై రైల్వే ట్రాకు వేసేకంటే, భూగర్భంలో వేసుకుంటే అదనంగా మరో రూ.1,500 కోట్లు వ్యయం అవుతుందని, అది కూడా రుణంగా తెచ్చుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు.

ఏఎంఆర్‌సీ ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి నగరంలో 250 ఎకరాల భూములు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ భూములను వాణిజ్య పరంగా అభివృద్ధి చేసి ఉపయోగించుకోవాలని భావించారు. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే కొమ్మాది నుంచి గాజువాక వరకు, ఇటు పాత పోస్టాఫీసు, మరోవైపు చినవాల్తేరు వరకు మూడు మార్గాల్లో రైల్వే లైను వేయాలని ప్రతిపాదించారు. రైల్వే లైను పొడవు 42.55 కిలోమీటర్లుగా నిర్థారించారు. అయితే ప్రాజెక్ట్ మాత్రం ఇంచు కూడా కదల్లేదు. ఇప్పుడు భూగర్భ రైల్వే మేలని అధికారులు భావించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.

మరోవైపు భూగర్భ మెట్రో ప్రాజెక్ట్ సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ ఖర్చుతో కూడుకోవడం, అవసరమైన జన సాంద్రత లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుక వెళ్లడం కష్టం అంటున్నారు. ప్రాజెక్టుపై ముందు ఆర్థిక నిపుణులతో కమిటీ వేయాలని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories