Top
logo

MANSAS Trust: పూటకో వివాదంతో రచ్చకెక్కుతోన్న మాన్సాస్ ట్రస్ట్

MANSAS Trust: పూటకో వివాదంతో రచ్చకెక్కుతోన్న మాన్సాస్ ట్రస్ట్
X
Highlights

MANSAS Trust Controversy Updates: రోజుకో మలుపు పూటకో వివాదంతో రచ్చకెక్కుతోన్న మాన్సాస్ ట్రస్ట్ లో అసలు ఏం...

MANSAS Trust Controversy Updates: రోజుకో మలుపు పూటకో వివాదంతో రచ్చకెక్కుతోన్న మాన్సాస్ ట్రస్ట్ లో అసలు ఏం జరుగుతోంది? మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ మార్పుతో ప్రక్షాళన దిశగా వెళుతోందా లేదా వివాదాలకు నిలయంగా మారుతోందా..? పీవీజీ రాజుగారి ఆశయ సంకల్పం నేడు నీరుగారనుందా..? వివాదాలే తప్పా అభివృద్ధి దిశగా ఒక్క అడుగు ముందుకు పడకపోవడానకి కారణాలేంటి..? ఇంతకీ మాన్సాస్ లో జరుగుతున్నదేంటి ? వారసత్వ రాజకీయమా..? ఆశయ సాధన కోసం ఆరాటమా.

మహారాజా అలక్‌ నారాయణ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ సొసైటీ మాన్సాస్ పేరుమీదుగా అందరికీ సుపరిచితమే. పేదవారికి విద్యనందించాలనే లక్ష్యంతో పీవీజీ రాజు ఏర్పాటు చేసిన ట్రస్టు నేడు వివాదాలకు నెలవైంది. అసలు మాన్సాస్ లో ఇలాంటి వివాదాలు చోటుచేసుకుంటాయని ఎవరూ ఊహించలేదు. గత పాలకులు తప్పులు చేసారని ట్రస్టు సభ్యులను మార్చిన నేటి పాలకులు సాధించింది ఏమిటనే దానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ అధికారంలోకి రాగానే మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ త్వరలోనే మాన్సాస్‌ లెక్కలు తేల్చుతామని ప్రకటించారు. ట్రస్ట్‌ భూముల వివరాలు కూడా అందజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అనంతరం దేవాదాయశాఖ రాజమండ్రి రీజనల్‌ ఆఫీసర్‌గా ఉన్న సీనియర్‌ అండ్‌ సిన్సియర్‌ అధికారి భ్రమరాంబకు మాన్సాస్‌ ఇన్‌ఛార్జి ఈఓగా బాధ్యతలు అప్పగించడంతో ఏదో జరుగుతుందని అంతా ఆశించారు. తీరా! ఆమె బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే కార్యాలయంలో విద్యుత్ బిల్లులు సహా విద్యాసంస్థల పనితీరు, వాటిలో జమాఖర్చులు, భూములు తదితర వాటిపై సమగ్ర దృష్టి సారించారు. అందులో లోపాలను బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆమెను బాధ్యతల నుంచి తప్పించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

గడిచిన ఐదేళ్లలో మాన్సాస్‌లో జరిగిన క్రయ విక్రయాలు చాలా వరకు చట్ట విరుద్ధమైనవేనని వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే జపిస్తున్న మాట. ఆ మాటకొస్తే మెడికల్‌ కాలేజీ పేరిట 144 ఎకరాల మాన్సాస్‌ భూములను గత చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు హయాంలో 400 కోట్ల రూపాయలకు విక్రయించారని దేవాదాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సంచయిత ఛైర్ పర్సన్‌గా ఎన్నికై సుమారు ఆరు నెలలు గడుస్తున్నా...తూర్పుగోదావరి జిల్లాలోని ట్రస్టు భూముల్లో ఇసుక స్కాములు, చింతవలస ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన కోట్ల రూపాయల లావాదేవీలపై ఎందుకు దృష్టి సారించట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మాన్సాస్ ఆధీనంలో ఉన్న ఎంఆర్‌ డిగ్రీ కాలేజీ సహా అన్ని విద్యాసంస్థల్లోనూ కార్పొరేట్‌ తరహా వ్యాపారం సాగుతోందని, ఫీజులు అమాంతంగా పెంచేశారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు తగ్గట్టే మాన్సాస్‌ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి నెలకోందని విద్యార్ది సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో పాటు ట్రస్ట్‌ పరిధిలోని 13 విద్యాసంస్థల్లోనూ సామాజిక వివక్ష కొనసాగుతోందని, కాంట్రాక్టు అధ్యాపకులకు సరైన వేతనాలు లేవని, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సామాజిక తరగతులకు చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారంలోకి రాగానే లెక్కలు తెలుస్తామని గగ్గోలు పెట్టిన నాయకులు ప్రస్తుతం మంత్రులుగా చలామణి అవుతోన్న పరిస్థితిలో మార్పు కనిపించకపోవటంతో జనాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే, సందట్లో సడేమియా అన్నట్లు ట్రస్ట్‌కు తామే వారసులమంటూ ఆనందగజపతిరాజు వారసులు మరోసారి తెరపైకి రావడంతో వారసత్వం పేరుతో ట్రస్టు సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి.

ఓ మహా సంకల్పంతో పీవీజీ రాజు నాడు నెలకోల్పిన మాన్సాస్ ట్రస్టు నేడు ప్రజా సమస్యలను పక్కన పెట్టి వారసత్వం పేరుతో ఇలా వీధికెక్కుతుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ట్రస్టు ఆశయ సాధన దిశగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజయనగరం వాసులు కోరుకుంటున్నారు.

Web TitleMANSAS Trust controversy ground report
Next Story