కర్నూలు కార్పొరేషన్‌‌లో తాగునీటి కష్టాలు

కర్నూలు కార్పొరేషన్‌‌లో తాగునీటి కష్టాలు
x
Highlights

కర్నూలు నగరం తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనబోతుందా..? మరో 15 రోజుల్లో ప్రకృతి సహకరించకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందా? అంటే ఔననే అంటున్నాయి తాజా...

కర్నూలు నగరం తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనబోతుందా..? మరో 15 రోజుల్లో ప్రకృతి సహకరించకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందా? అంటే ఔననే అంటున్నాయి తాజా పరిస్థితులు. ఇప్పటికే జలాశయాలు అడుగుంటి పోవడంతో తాగునీరు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోజువారీ నీటి విడుదల చేయలేమని కర్నూలు కార్పొరేషన్ అధికారులు చేతులు ఎత్తేశారు. జలాశయాల్లో చుక్కనీరు లేని పరిస్థితుల్లో తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు కర్నూలు వాసులు.

కర్నూలు కార్పొరేషన్‌‌లో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తాగునీటి కోసం ఉన్న వనరులన్నింటినీ మున్సిపల్ అధికారులు వినియోగించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న నీటిని ప్రత్యామ్నాయ రోజుల్లో 20 రోజుల వరకూ సరఫరా చేయడానికి అవకాశం ఉంది. ఈ లోగా ప్రకృతి సహకరించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది మున్సిపల్ కార్పొరేషన్.

కార్పొరేషన్ పరిధిలో సుమారు 5లక్షల 30వేల మంది జీవనం సాగిస్తున్నారు. నగరానికి వచ్చిపోయే వారితో కలిపితే మొత్తం 5లక్షల 50వేల మందికి కార్పొరేషన్ తాగునీరు అందిస్తోంది. 84 మిలియన్ లీటర్ల నీటిని పంపిణీ చేస్తోంది. అయితే, ప్రస్తుతం 67 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే కార్పొరేషన్ సరఫరా చేస్తోంది. ముఖ్యంగా కర్నూలు నగరంలో 1100 ఎకరాల్లో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పూర్తి స్థాయి నీటిమట్టం 0.155 టీఎంసీలుండగా, ప్రస్తుతం 0.0098 టీఎంసీలు ఉంది. దీంతో సుంకేసుల నుంచి 1500 క్యూసెక్కుల చొప్పున నీటిని సరఫరా చేస్తే.. 26రోజులపాటు పంపిణీ చేసేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

అధికారికంగా రోజు మార్చి రోజు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నా..అనధికారికంగా మూడు, నాలుగు రోజులకొకసారి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నగరవాసులకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పరిస్థితి చేయి దాటకముందే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఎప్పుడో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుపై ఇప్పుడు పెరిగిన జనాభాకు అధికారులు ఎలా ఆధారపడుతారంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికే కాగితాలకే పరిమితం చేసిన కర్నూలు నగర తాగునీటి ప్రాజెక్ట్‌ను యుద్ద ప్రాతిపదికన ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కర్నూలు నగరవాసులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే హఫీజ్‌‌ఖాన్ స్థానిక అధికారులకు సూచించారు. మరి కర్నూలు నగరంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories