నీడలా వెంటాడుతున్న కోడెల తప్పులు

నీడలా వెంటాడుతున్న కోడెల తప్పులు
x
Highlights

ఎదిగిన కొద్దీ ఒదగాలంటారు. పెద్ద పెద్ద పదువులు నిర్వర్తిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని లక్షణాలని, కొన్ని ఆశలను, అత్యాశలను అదుపులో...

ఎదిగిన కొద్దీ ఒదగాలంటారు. పెద్ద పెద్ద పదువులు నిర్వర్తిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని లక్షణాలని, కొన్ని ఆశలను, అత్యాశలను అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే సరిగ్గా ఇదిగో ఇలాగే ఉంటుంది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు. డాక్టర్ గా సేవలు అందిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. చివరకు స్పీకర్ గా కూడా వ్యవహరించారు. ఎమ్మెల్యేలను అదుపులో పెట్టే చట్ట సభను సజావుగా నడిపే గురుతర, ఆదర్శ బాధ్యతని నిర్వర్తించారు.

అయితే, స్పీకర్ పదవి ముగిశాక కోడెల గత తప్పిదాలు నీడలా వెంటాడుతున్నాయి. స్పీకర్‌ పదవిలో ఉంటున్నప్పటికీ కొన్ని అనుచిత చర్యలు ఆ పదవికే కళంకం తెచ్చాయి. రోజుకో ట్విస్టులతో ఆయన వ్యవహారమంతా ఇప్పుడు ఎపిలో హాట్ టాపిక్ గా మారింది. విషయంలోకి వస్తే, ఎపి అసెంబ్లీ హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలింది. ఆ సమయంలో హైదరాబాద్ అసెంబ్లీ ఫర్నీచర్ మాయమైంది. ఎపి అసెంబ్లీకి చేరలేదు. అప్పట్లో అప్పటి టిడిపి ప్రభుత్వం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారాక, కొత్త స్పీకర్ కి చార్జి ఇచ్చే సమయంలో ఫర్నీచర్ విషయం బట్టబయలైంది. దీంతో ఎపి అసెంబ్లీ కార్యదర్శి తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుండి వెలగపూడికి తరలిస్తుండగా, కొంత ఫర్నీచర్ మిస్సైందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

దీంతో మాజీ స్పీకర్ కోడెల మీడియా ముందుకు వచ్చారు. ఆ ఫర్నీచర్ తన వద్దే ఉందని వెలగపూడి అసెంబ్లీలో స్థలం లేని కారణంగా తన ఇంట్లో ఉంచానని ప్రకటించారు. సత్తెనపల్లి, గుంటూరు, హైదరాబాద్ ల్లోని మూడు చోట్ల ఉన్న ఫర్నీచర్ తిరిగి ఇస్తామని, లేదంటే ఆ ఫర్నీచర్ విలువ కట్టి డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేశారు.

అవును ఆ సామాను నా వద్దే ఉందని కోడెల స్వయంగా ప్రకటించడంతో సమస్య కొత్త మలుపు తిరిగింది. ఇష్యూని వైసీపీ టేకప్ చేసింది. అవినీతికి పాల్పడ్డారని, ఆ ఫర్నీచర్ ని నొక్కేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది. అయితే, కొడెల ఇంట్లో శుక్రవారం చోరీ జరిగింది. కోడెల ఇంటిలో విద్యుత్ పోయింది. అదే సమయంలో విద్యుత్ ఉద్యోగులుగా చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు కోడెల ఇంటికి వచ్చారు. కంప్యూటర్లు తీసుకెళుతున్న ఆ ఇద్దరిని వాచ్ మన్ అడ్డుకున్నాడు. ఆ ఇద్దరిలో అర్జున్ అనే వ్యక్తి గతంలో కోడెల క్యాంపు కార్యాలయంలో పని చేసి ఉండటం, ప్రస్తతం ఆ అర్జున్ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గర పని చేస్తుండటం మరో వివాదానికి దారి తీసింది.

దీంతో కోడెల మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, తన ఇంట్లో చోరీ జరిగిందని, ఈ చోరీకి వచ్చిన వ్యక్తులు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వద్ద పని చేస్తున్నాడు ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. వెంటనే అంబటి రాంబాబు కోడెల మీద విరుచుకుపడ్డారు. కొత్త డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. కోడెల ఇంట్లో జరిగిన చోరీకి తనకు సంబంధమే లేదన్నారు. అంతేగాక తిరిగి ఫర్నీచర్ ఇచ్చినంత మాత్రాన కోడెల దొంగ కాకుండా పోరని విమర్శించారు

ఇదిలావుండగా స్పీకర్ కోడెల మీద స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ అధికారి బాజుబాబు 2017లో సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన సెంటర్ లో ల్యాప్ ట్యాప్ లు, ప్రింటర్లు మాయమయ్యాయని సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక ఈ ఎపిసోడ్ కోడెల కుమారుడు నడుపుతున్న గౌతం షోం రూమ్ కి మారింది. అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ రాజ్ కుమార్, గుంటూరు ఎమ్మార్వో మోహన్ రావులు తమ సిబ్బందితో షో రూంలో ఉన్న బర్మాటేకుతో చేసిన 10 కుర్చీలు, స్పీకర్ క్యాంపాఫీసు ఉన్న అదే భవనంలోని 3, 4వ అంతస్తుల్లోని తాళాలు తెరచి. యూరప్ నుంచి దిగమతి చేసిన 22కుర్చీలు, 4 సోఫాలు, ఓ టీపాయ్, ఓ దర్బార్ చైర్ లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు.

తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అధికారిక లేఖలు ఏవీ లేకుండానే, పబ్లిక్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే హక్కు వాళ్ళకు లేదని కోడెల తరపు న్యాయవాది చిరంజీవులు అన్నారు. ఇదిలావుండగా శాసనసభలో ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో శాసనసభ సచివాలయం చీఫ్ మార్షల్ గణేశ్‌బాబుపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. శాసనసభ చీఫ్ మార్షల్ పోస్టు నుంచి ఆయన్ను తప్పించింది. శాసనసభ చీఫ్ మార్షల్‌గా గణేశ్‌బాబు సేవలను ఉపసంహరిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల సహా, ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా మొత్తం19 కేసులున్నాయి. ఇప్పటికే కే–ట్యాక్స్‌ వసూలు కేసుల్లో కోడెల కుమారుడు, కూతురు ముందస్తు బెయిల్ కోసం విఫల యత్నం చేస్తున్నారు. ఒకప్పుడు కోడెలను ఆదరించిన ప్రజలు, వెంట ఉన్న కార్యకర్తలు దూరమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్నదంతా కక్ష సాధింపు చర్యగా సానుభూతి పొందేందుకు ప్రాధేయ పడ్డా, చంద్రబాబు వద్ద సఫలం కాలేదు. సేవ్‌ సత్తెనపల్లి, క్విట్‌ కోడెల అంటూ సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సాక్షాత్తు చంద్రబాబు ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో సత్తెనపల్లిలో మొఖం చాటేసిన కోడెల, గత కొన్ని రోజులుగా నరసరావుపేటకు వచ్చి పోతున్నారు. బీజేపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలూ బెడిసి కొట్టాయి. చివరకు కోడెల ఏకాకిగా మిగిలారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories