భారీ వరదతో కృష్ణమ్మ పరవళ్లు

భారీ వరదతో కృష్ణమ్మ పరవళ్లు
x
Highlights

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కళకళలాడుతున్నాయి....

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కళకళలాడుతున్నాయి. వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున శ్రీశైలంలో 10 గేట్లు, నాగార్జున సాగర్‌లో 26 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో జూరాల జలాశయం నిండుకుండలా మారింది. మొత్తం 8.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అన్ని గేట్లను పైకెత్తి 8.63 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలుకాగా ప్రస్తుతం 5.85 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకుగానూ ప్రస్తుతం 316.44 మీటర్లు నమోదైంది.

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 7.53లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 8.51 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జలాశయం 10 గేట్లను 42 అడుగుల మేర పైకెత్తి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా 8,20,162 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యూలేటరీకి 28వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.60 అడుగులు నమోదైంది.

శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నాగార్జునసాగర్‌ జలకళ సంతరించుకుంటోంది. సాగర్‌కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు 26 గేట్లను పైకెత్తారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 559.20 అడుగులు నమోదైంది. సాగర్‌ నుంచి వరద జోరు కొనసాగితే ఇవాళ లేదా రేపటికి పులిచింతల నిండే అవకాశముంది. నాగార్జునసాగర్‌కు జలకళ సంతరించుకోవడంతో అక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. సాగర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories