అనంతపురం జిల్లాలో వలస కార్మికులతో భయం.. భయం !

అనంతపురం జిల్లాలో వలస కార్మికులతో భయం.. భయం !
x
Highlights

అనంతపురం జిల్లాలో వలస కూలీలు, కొయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారితో ప్రమాదం ముంచుకొస్తోంది. పెద్ద ఎత్తున కరోనా లక్షణాలు బయటపడుతుండడంతో కోవిడ్...

అనంతపురం జిల్లాలో వలస కూలీలు, కొయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారితో ప్రమాదం ముంచుకొస్తోంది. పెద్ద ఎత్తున కరోనా లక్షణాలు బయటపడుతుండడంతో కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అనుమానితులను వారి కాంట్రాక్ట్ లను గుర్తించి క్వారెంటైన్ కు పంపుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారితో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదవుతున్న తరుణంలో ముంబైకూలీల టెన్షన్ పెరుగుతంది.

లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలు, విద్యార్థులు, యాత్రికులు పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక రైలులో ముంబై లోని కళ్యాణి ప్రాంతం నుంచి 670 మంది వలస కూలీలు ఈ నెల ఆరున జిల్లాకు చేరుకున్నారు. వారిని గుంతకల్లు, ఉరవకొండ, విడపనకల్లు కేంద్రాల్లోని క్వారెంటైన్ సెంటర్లలో ఉంచారు. కొయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వ్యాపారులు 400 మందికి పైగా అధికారులు గుర్తించారు. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, తాడిపత్రి పరిసర ప్రాంతాల నుంచి వ్యాపారులు చెన్నై సమీపంలోని కొయంబేడు మార్కెట్ కు వెళ్లివచ్చారు. ఇతర జిల్లాల్లో ఉన్న విద్యార్థులు తరలివస్తున్నారు. కియా వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో పనులు ప్రారంభం కావడంతో తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున కూలీలు జిల్లాకు చేరుకుంటున్నారు. వీరందరినీ గుర్తించడం క్వారెంటైన్ కు తరలించడం అధికారులకు ముఖ్యంగా పోలీసులకు తలనొప్పిగా మారింది.

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో పెద్ద ఎత్తున కరోనా లక్షణాలు ప్రాథమిక పరీక్షల్లో బయటపడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబై వలస కూలీల్లో ఇప్పటికే ముగ్గురు కరోనా తో చికిత్స పొందుతున్నారు. ఓ క్వారెంటైన్ కేంద్రంలో 10 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వారందరినీ కోవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. విడపనకల్లు లోని క్వారెంటైన కేంద్రంలో ఉన్న 32 మంది లో కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకూ జిల్లాలో 122 కేసులు నమోదుయ్యాయి. వలస కూలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వస్తున్న వారిని ఖచ్చితంగా క్వారెంటైన్ కు తరలించి 14 రోజులు ఉంచుతున్నామని పరీక్షల్లో కరోనా లక్షణాలు బయటపడితే ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తిలేదని అందరకూ క్వారెంటైన్ కు వెళ్లాల్సిందే అని తెగేసి చెబుతున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. కర్ణాకట సరిహద్దు లతో పాటు ఇతర జిల్లాల కు వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత గా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories