logo

బాబు నివాసంపై డ్రోన్ చక్కర్లు.. ఎస్పీ, డీజీపీలకు చంద్రబాబు ఫోన్..

బాబు నివాసంపై డ్రోన్ చక్కర్లు.. ఎస్పీ, డీజీపీలకు చంద్రబాబు ఫోన్..
Highlights

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణా నదికి వరద ఉధృతి నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్‌ను ప్రయోగించారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణా నదికి వరద ఉధృతి నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్‌ను ప్రయోగించారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రోన్‌ ప్రయోగించిన వ్యక్తులను తమ అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత దేవినేని అవినాష్, టీడీ జనార్ధన్ తో పాటు భారీగా టీడీపీ కార్యకర్తలు.. చంద్రబాబు నివాసానికి వచ్చారు. వీరందరినీ చంద్రబాబు ఇంటిలోకి అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పట్టుబడ్డ వ్యక్తులు మాత్రం తాము నీటిపారుదల శాఖకు చెందిన ఉద్యోగులమని చెప్పారు. అయితే వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

మరోవైపు ఈ ఘటనపై చంద్రబాబు కూడా స్పందించారు. డ్రోన్‌ విషయం తెలిసిన వెంటనే డీజీపీ, జిల్లా ఎస్పీలతో మాట్లాడిన చంద్రబాబు.. హై సెక్యూరిటీ జోన్ లో డ్రోన్లు ఎలా ఎగరవేస్తున్నారని ప్రశ్నించారు. డ్రోన్లు ప్రయోగించింది ఎవరు? అందుకు అనుమతులు ఎవరిచ్చారని అడిగారు. పట్టుబడిన వ్యక్తుల పేర్లను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ వివరణ ఇచ్చింది. వరద పరిస్థితిపై అంచనా కోసం విజువల్స్ కోరామని అందుకే డ్రోన్‌ ప్రయోగించినట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతం నుంచి మరింత వరద వచ్చే అవకాశముందని.. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై అవగాహనకు వచ్చేందుకే దృశ్యాలు చిత్రీకరించేందుకు నిర్ణయించామని ఏపీ జలవనరుల శాఖ ప్రకటన విడుదల చేసింది.

లైవ్ టీవి

Share it
Top