వైద్యుడైన నా బిడ్డను పిచ్చివాడిగా ముద్రవేయడం బాధిస్తోంది : డాక్టర్ సుధాకర్ తల్లి

వైద్యుడైన నా బిడ్డను పిచ్చివాడిగా ముద్రవేయడం బాధిస్తోంది : డాక్టర్ సుధాకర్ తల్లి
x
Highlights

డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి చేరింది. ప్రభుత్వ నివేదికలను తప్పుబట్టిన ఏపీ హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఎనిమిది...

డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి చేరింది. ప్రభుత్వ నివేదికలను తప్పుబట్టిన ఏపీ హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు మలుపులు తిరిగి చివరకు సీబీఐ ముంగిట్లోకి చేరుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ హై కోర్ట్ సీబీఐని ఆదేశించింది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్నట్లు మెజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని... ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసేలేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదన్న హైకోర్టు... సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది.

ప్రభుత్వాన్ని విమర్శించటంతో ప్రారంభమైన డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. అసలే ప్రభుత్వంపై విమర్శలతో సస్పెన్షన్‌కు గురైన సుధాకర్‌.. విశాఖలో నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కనిపించిన వీడియోలు సంచలనం రేపాయి. అదే సమయంలో ఓ కానిస్టేబుల్‌ సుధాకర్‌తో దురుసుగా ప్రవర్తించిన వీడియోలో రికార్డవటం వివాదాన్ని మరింత పెద్దదిగా చేశాయి.

ఇక విశాఖ పోలీసులు సుధాకర్‌తో వ్యవహరించిన తీరుపై... వీడియోలతో సహా హైకోర్టుకు లేఖ రాశారు టీడీపీ నేత వంగలపూడి అనిత. ఈ లేఖను సుమోటో పిల్‌గా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. కేసు ను సీబీఐ కి అప్పగించడంతో తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానంటున్నారు సుధాకర్ తల్లి కావేరమ్మ. వైద్యుడిగా ఎంతోమందికి సేవలందించిన వ్యక్తిని పిచ్చివాడిగా ముద్ర వేయడం బాధ కలిగించిందన్నారు.

ఇక ఈ వ్యవహారంపై మొదటి నుంచీ... వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌ జరుగుతోంది. తాజా తీర్పు నేపథ్యంలోఅధికార, ప్రతిపక్ష నేతలు మరోసారి ఆరోపణలకు దిగారు . జగన్ ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందన్న టీడీపీ నేత వంగలపూడి అనిత... హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు అన్నారు. పోలీస్ వ్యవస్థ తీరు మార్చుకోవాలన్నారు.

అనిత వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ నదిగం సురేశ్.. చెంపపెట్టు తగిలితే టీడీపీ వాళ్లకు తగిలి ఉంటుందన్నారు. సీఎంను సుధాకర్‌ ఇష్టారాజ్యంగా దూషించారని.. చంద్రబాబు డైరెక్షన్‌లో సైకోలా ప్రవర్తించారన్నారు. దళితులను వాడుకుని మోసం చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు ఎంపీ సురేశ్‌.

మొత్తానికి సస్పెండైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ వ్యవహారం టీడీపీ, వైసీపీ మధ్య వార్ లా మారింది. ఇప్పుడు ఇందులో కోర్టు జోక్యం చేసుకోవడంతో సీన్ క్లైమాక్స్ కు చేరుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories