logo

ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు..

ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు..
Highlights

ఏపీ మంత్రిమండలి సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన కేబినేట్‌...

ఏపీ మంత్రిమండలి సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన కేబినేట్‌ మీటింగ్‌.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులను ఆమోదించింది. ప్రాజెక్టుల కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియను పాదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటుపై చట్టసవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం కేటాయించేలా చట్టం తీసుకురానుంది. ఈ ముసాయిదాను కూడా కేబినేట్‌ ఆమోదించింది. యజమాని హక్కులకు భంగం కలగకుండా 11 నెలల పాటు కౌలు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేలా రూపొందించిన బిల్లును ఆమోదించింది.

కౌలు రైతులకు రైతు భరోసా అమలుపై చట్టాన్ని తీసుకురానుండటంతో దీనికి సంబంధించిన బిల్లుకే కేబినేట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాకుండా.. అన్ని దేవాలయాల పాల‌క‌మండ‌ళ్ళ ర‌ద్దు చేసే అధికారంతో పాటు ఆలయ కమిటీల్లో నియామకాల కోసం దేవాదాయ శాఖ చ‌ట్టంలో మార్పులు చేసే బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. టీటీడీ పాల‌క‌మండ‌లిని ఎప్పుడైనా రీకాల్ చేసేలా హిందూ ధార్మిక చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేసే బిల్లుకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రయివేట్ కాలేజీలు, స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ‌, విద్యాసంస్థల నియంత్రణ మండ‌లి ఏర్పాటు చేస్తూ చేసిన స‌వ‌ర‌ణ‌లకు ఆమోదం తెలిపింది. మ‌రోవైపు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసేలా చట్టాన్ని తీసుకురానుంది. ఇక స‌మ‌గ్ర భూ స‌ర్వే నిర్వహించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 1,33,867 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ అంగీకారం తెలిపింది.


లైవ్ టీవి


Share it
Top