వరదంతా తన ఇంటి వద్దకు రావాలనేది వైసీపీ ఆలోచన: చంద్రబాబు

వరదంతా తన ఇంటి వద్దకు రావాలనేది వైసీపీ ఆలోచన: చంద్రబాబు
x
Highlights

కృష్ణానది వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని ప్రభుత్వ వైపరీత్యమే అని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తన ఇల్లు ముంచాలనే ఉద్దేశంతో ప్రజలను నిండా...

కృష్ణానది వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని ప్రభుత్వ వైపరీత్యమే అని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తన ఇల్లు ముంచాలనే ఉద్దేశంతో ప్రజలను నిండా ముంచారన్నారాయన. వరద పరిస్థితిని నియంత్రించడానికి అవకాశం ఉన్నా రాజధానిని వరద నీటితో ముంచాలని జగన్‌ సర్కార్‌ తప్పుడు ఆలోచన చేసిందన్నారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్న బాబు గుంటూరులోని తన కార్యాలయంలో పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌తో అసలు నిజాలు ఇవీ అంటూ వివరించారు.

ఇటీవల సంభవించిన వరద పరిస్థితులపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 19 గ్రామాల్లో పర్యటించానని, వరద పరిస్థితిని సమీక్షించానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఎక్కడ చూసినా హృదయ విదారక పరిస్థితులు కనిపించాయన్నారు. దాదాపు 53 వేల ఎకరాల పంటభూములు నీట మునిగాయన్నారు. వరదలపై ఏనాడూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష చేయలేదన్నారు చంద్రబాబు.

నీటి ప్రవాహం వివరాలన్నీ ప్రభుత్వం, అధికారుల దగ్గర ఉంటాయన్నారు చంద్రబాబు. ఏ రిజర్వాయర్‌లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోకుండా, వాటిని నింపే ప్రయత్నం చేయకుండా దిగువకు వదిలేశారని, అందుకే ప్రకాశం బ్యారేజీ దిగువ లంక గ్రామాలు వరదలో మునిగిపోయాయని వివరించారు. ఆల్మట్టి నుంచి నారాయణ్‌పూర్‌కు నీరు రావాలంటే 12 గంటల సమయం పడుతుందని, మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు కృష్ణానది 1400కి.మీ ప్రయాణిస్తుందని వివరించారు.

ప్రకాశం బ్యారేజీలో నీళ్లు నేరుగా తన ఇంటి వద్దకు రావాలనేది వైసీపీ ఆలోచన అని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఎవ్వరికీ నోటీసులు ఇవ్వని తన ఇంటికి మాత్రం ఎందుకిచ్చారంటూ మండిపడ్డారు. అనుమతి తీసుకోకుండా, తన నివాసంపై డ్రోన్‌ ఎగురవేశారని దుయ్యబట్టారు. వచ్చిన నీళ్లు సక్రమంగా ఎలా వదలాలో తెలిస్తే చాలని, 20 రోజులు వరద నీరు ప్రవహిస్తుంటే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

వరదలు వచ్చాయని రాజధానిని మారుస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణతో సంబంధాలు బాగున్నాయని ప్రభుత్వం చెబుతోందని, అలాంటప్పుడు సముద్రంలో పోయే నీటిని పోతిరెడ్డిపాడుకు మళ్లిస్తే తెలంగాణ ఎందుకు ఫిర్యాదు చేసిందని ప్రశ్నించారు. కృష్ణా వాటర్‌ రివర్స్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయడం ప్రభుత్వానికి తెలియదా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సముద్రంలోకి పోయే నీటిని రాయలసీమకు ఎందుకు తీసుకెళ్లలేకపోయారని ప్రశ్నించారు.

వరదల వల్ల 53 వేల ఎకరాల భూమి వరద ముంపునకు గురైందన్నారు. ఐఎండీ, ఇస్రో హెచ్చరికలు ఉంటే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు పూర్తి నష్టపరిహారం, నెలకు సరిపడా రేషన్‌ సరకులు, దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇవ్వాలని కోరారు చంద్రబాబు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories