వైభవంగా కలియుగ వైకుంఠవాసుడి బ్రహ్మోత్సవాలు

వైభవంగా కలియుగ వైకుంఠవాసుడి బ్రహ్మోత్సవాలు
x
Highlights

కలియుగ వైకుంఠ వాసుడికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. రోజుకు రెండేసి ప్రకృతి శక్తులను వాహనాలుగా మలచుకొని.. నిత్యోత్సవ మూర్తి...

కలియుగ వైకుంఠ వాసుడికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. రోజుకు రెండేసి ప్రకృతి శక్తులను వాహనాలుగా మలచుకొని.. నిత్యోత్సవ మూర్తి విహరిస్తుంటే.. బ్రహ్మోత్సవ శోభను ఇంతింతలుగా వర్ణించడం సాధ్యమా అంటూ.. భక్తకోటి ఆనందపరవశమవుతోంది. అరిషడ్వర్గాలకు లోనై తపించే మానవాళికి.. వేంకటపతి నామం సర్వ తాపోపశమనం. అన్ని పాపాలనూ.. తాపాలనూ హరించేటి.. వేంకటపతిని.. బ్రహ్మోత్సవ శుభవేళ తిరుమాడ వీధుల్లో విహరిస్తుంటే తిలకించడం ముక్తిప్రదం.. సద్గతి దాయకం. వాహనాలపై ఊరేగుతున్న మలయప్ప స్వామిని తిలకించిన భక్తకోటి పులకాంకితమైంది.. తమ పుణ్యానికి మురిసిపోయింది.

తిరుమల క్షేత్రపు వేలుపు శ్రీ వేంకటేశుడు.. తనను నమ్మి కొలిచే వారి పాలిట కొంగు బంగారమే. భక్తసులభుడైన శ్రీనివాసుడు... ప్రియ భక్తులపై అవ్యాజమైన అనురాగంతో... వారికి ఎనలేని వరాలను ప్రసాదించారు. శ్రీవారి నాటి వరప్రభావ ఫలాలను... నేటి తరమూ అనుభవిస్తోంది. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో గోదాదేవి మాలకు... ఛత్రరాజాలకు విశిష్ట స్థానం ఉంది. శ్రీనివాసుడి ఉత్సవమూర్తులను ఏడాదంతా తాజాపూల మాలలతో అలంకరిస్తారు. అయితే.. బ్రహ్మోత్సవాల్లో... ఓ రోజున... గోదాదేవి ధరించిన మాలను తెచ్చి శ్రీవారికి అలంకరిస్తారు. తిరుమలేశుడు తనను నమ్మి.. దాసోహం అన్న భక్తులను ఎంతలా కరుణిస్తాడో ఈ ఉదంతం చాటుతుంది.

కలియుగంలో ముక్తికి శ్రీహరి నామ స్మరణమే సర్వ శుభప్రదమైన సాధనం... ఇది తప్ప మరో ఉపాయమే లేదు అన్నది భక్తుల అచంచల విశ్వాసం. అందుకే జరామరణాల నడుమ ఘోర సంసార సాగరంలో కొట్టుమిట్టాడే వారు భగవంతుని నామమాత్రంగా స్మరించి పుణ్యగతులను సులువుగా పొందగలుగుతున్నారు. సద్గతుల సాధనలో.. శ్రీవారి భక్తులకు స్వామి బ్రహ్మోత్సవాలు ఇతోధికంగా సహాయపడతాయట. అందుకే... ఏడుకొండల రేని బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించేందుకు భక్తులు తహతహలాడుతుంటారు.

జగ్రదక్షకుడు శ్రీనివాసుడు... అండ పిండ బ్రహ్మాండాలన్నింటినీ ఏలేటి దేవుడు... భక్తకోటి హృదయాలను పులకింప చేసేటి విభుడు... శ్రీ వేంకటేశుడు. శ్రీవారి మూల విగ్రహమే భక్తులకు పరిచయం. దీన్ని మూలబేరం అంటారు. అయితే.. ఈ మూలమూర్తితో పాటు.. ఆనందనిలయంలో... శ్రీనివాసుడికే చెందిన మరో నాలుగు విగ్రహాలూ ఉన్నాయి. ఈ అన్నింటినీ పంచ బేరాలు అని పిలుస్తారు. ఆ విశేషాలను ఓసారి పరికిద్దాం...

ముక్తిగాములై వచ్చే భక్తులకు... క్షణకాలపు దర్శన మాత్రాన్నే.. ఈప్సితాలన్నింటినీ నెరవేర్చే శ్రీనివాసుడి మూలవిరాట్టు.. ఆనంద నిలయంగా పిలిచే గర్భాలయంలో కొలువై ఉంది. ఈ విగ్రహాన్ని ఆగమ పరిభాషలో ధృవబేరం అని అంటారు. యోగ, భోగ, విరహ రూపాల్లో కాకుండా ఈ విగ్రహం వీరస్థానక విధానంలో నిలబడే ఉంటుంది. ఈ ధృవబేరానికి అనుబంధంగా శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. ఇది స్థిరమై ఉంటుంది.

రెండోది కౌతుక బేరం. ఈ మూర్తిని భోగ శ్రీనివాసుడు అని కూడా అంటారు. ఆగమ శాస్త్రానుసారం ప్రతి ధృవ బేరానికీ ఓ కౌతుక బేరం ఉంటుంది. రోజువారీ దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవ మొదలైన సేవలన్నీ ఈ కౌతుక బేరానికే జరుగుతాయి. కౌతుక బేరం పీఠానికి అడుగున ఒక యంత్రం కూడా ఉంది. కౌతుక బేరం తరహాలోనే ధృవబేరం పీఠాన యంత్రం ఉండొచ్చని.. దాని బల మహాత్యమ వల్లే శ్రీవారి మహిమలు విశ్వ వ్యాప్తమయ్యాయనీ నమ్ముతారు.

మూడోది స్నపన బేరం. 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా వ్యవహరించిన ఉగ్ర శ్రీనివాసుడి విగ్రహాన్నే స్నపన బేరం అంటారు. ఒకసారి ఊరేగింపు సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఈ మూర్తిని ఉగ్ర శ్రీనివాసుడిగా గుర్తించారని అంటారు. మిగిలిన విగ్రహాలకి భిన్నంగా స్నపన బేరం శ్రీదేవి, భూదేవి సమేతమై ఉంటుంది. ఏడాదికొకసారి మాత్రం సూర్యోదయానికి ముందు ఈ విగ్రహాన్ని సర్వాలంకారాలతో ఊరేగింపుగా తీసుకు వెళ్లి మళ్లీ అంతరాలయంలోకి తీసుకు వస్తారు.

ఇక నాలుగోది బలిబేరం. గర్భగుడిలోనే ఉండే బలిబేరాన్ని కొలువు శ్రీనివాసుడు అనికూడా అంటారు. మూలవిరాట్‌కి తోమాలసేవ జరిగాక, కొలువు శ్రీనివాసుణ్ణి ఆస్థాన మంటపంలోకి తీసుకు వచ్చి ముందు రోజు వచ్చిన హుండి బహుమానాలను, ఆదాయ వ్యయాల లెక్కలను అప్పజెబుతారు.

ఇక చివరిది ఉత్సవ బేరం. ఉగ్రశ్రీనివాసుడి విగ్రహాన్ని బయటి ఊరేగింపులకు తీసుకెళ్లడం మానేసిన దగ్గర్నుంచీ, శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్పస్వామి విగ్రహాన్నే అన్ని ఉత్సవ సేవల్లోకీ తీసుకు వెళుతున్నారు. మూడడుగుల ఎత్తుండే ఈ మూర్తిని ఉత్సవ బేరం అంటారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో భక్తుల కనువిందు చేస్తున్నది ఈ ఉత్సవ బేరమే. మూలవిరాట్టును మాత్రమే దర్శించినా... మిగిలిన బేరాలన్నీ ఎల్లవేళలా తమను రక్షిస్తూ ఉంటాయన్నది భక్తుల అచంచల విశ్వాసం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories