logo

నేడు ఏపీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌.. ఎలా ఉంటుంది... ఏ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం?

నేడు ఏపీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌.. ఎలా ఉంటుంది... ఏ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం?
Highlights

జగన్ ప్రభుత్వం నేడు తొలి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 8గంటలకు ప్రత్యేకంగా సమావేశంకానున్న ఏపీ కేబినెట్‌‌...

జగన్ ప్రభుత్వం నేడు తొలి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 8గంటలకు ప్రత్యేకంగా సమావేశంకానున్న ఏపీ కేబినెట్‌‌ 2019-20 వార్షిక బడ్జెట్‌‌ను ఆమోదించనుంది. అనంతరం ఉదయం 11గంటలకు ఆర్ధికమంత్రి బుగ్గన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వైసీపీ మేనిఫెస్టో, ఎన్నికల హామీలు, రైతు సంక్షేమం, నవరత్నాల అమలే లక్ష్యంగా భారీ బడ్జెట్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌‌రెడ్డి 2019-20 వార్షిక బడ్జెట్‌‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల అమలే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉండనుంది. అయితే వివిధ శాఖల నుంచి దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర ప్రతిపాదనలు రావడంతో అదే స్థాయిలో భారీ బడ్జెట్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నవరత్నాల అమలుకే 66వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు ఉండనున్నాయి. అమ్మ ఒడికి 4వేల 900కోట్లు, ఫీజు రీఎంబర్స్‌‌మెంట్‌కు 5వేల కోట్లు, వైఎస్సార్ ఆసరాకు 7వేల కోట్లు, సామాజిక పెన్షన్ల కోసం 15వేల కోట్లు, గృహనిర్మాణానికి 8వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక కీలకమైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి 6వేల 300కోట్లు, అలాగే ముఖ్యమైన హామీల్లో ఒకటైన రైతు భరోసాకు సుమారు 12వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల కోసం 8వేల కోట్లు, రాజధాని నిర్మాణం కోసం 400కోట్లు, ధరల స్థిరీకరణకు 3వేల కోట్లు, అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు, వివిధ కులాల కార్పొరేషన్లకు 3వేల కోట్లు, రైతుల ఉచిత విద్యుత్‌కు 4వేల కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి వెయ్యి కోట్ల మేర వెచ్చించనున్నట్లు చెబుతున్నారు. అయితే సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టకునే తమ బడ్జెట్‌ ఉండనుందని, ఒకవిధంగా వైసీపీ మేనిఫెస్టోను చూస్తేచాలు తమ బడ్జెట్‌ ఎలా ఉండబోతుందో తెలుస్తుందన్నారు. జగన్‌ ప్రభుత్వ ప్రాధాన్యాతలు, కేటాయింపులు ఎలా ఉంటాయోనని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలను ఇప్పటికే సీఎం జగన్మోహన్‌‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలోనే రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజల సంక్షేమమే టార్గెట్‌గా బడ్జెట్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.


లైవ్ టీవి


Share it
Top