అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష.. చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష.. చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
x
Highlights

మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు...

మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు ఇచ్చే విధంగా ఈ బిల్లును రూపొందించారు. వారంరోజుల్లో దర్యాప్తు పూర్తి, 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్‌ వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ చరిత్రాత్మక బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు లాంటి నేరాల విచారణకు ప్రతిజిల్లాలో ప్రత్యేక కోర్టులకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే, చర్యలు తీసుకోనున్నారు. సెక్షన్‌ 354(ఇ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో అంశాలను పొందుపరిచారు.

మొదటి సారి తప్పు చేస్తే.. 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే.. నాలుగేళ్లు జైలుశిక్ష విధించనున్నారు. మెయిల్, సోషల్‌మీడియా, డిజిటిల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే.. ఈ చర్యలు తీసుకోనున్నారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే.. 354 (ఎఫ్‌) కింద చర్యలు తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పోస్కో చట్టం కింద ఇప్పటివరకూ 3ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తున్నారు. అయితే, ఈ శిక్షను పెంచుతూ బిల్లులో అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories