Top
logo

ఇక్కడ వుండలేరు..అక్కడ రానీయరు..ఆగమాగం అవుతున్న ఆంధ్ర విద్యార్థులు

ఇక్కడ వుండలేరు..అక్కడ రానీయరు..ఆగమాగం  అవుతున్న ఆంధ్ర విద్యార్థులు
Highlights

హైదరాబాద్ నుంచి సొంత ప్రాంతాలకు వస్తున్న ఏపీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఆ రాష్ట్ర పోలీసులే చుక్కలు...

హైదరాబాద్ నుంచి సొంత ప్రాంతాలకు వస్తున్న ఏపీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఆ రాష్ట్ర పోలీసులే చుక్కలు చూపిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వస్తున్నవారిని తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లోనే కట్టడి చేశారు. తెలంగాణ పోలీసులతో ఎన్ వోసీ తెచ్చుకుని, వందల కిలోమీటర్లు బైక్ లపై ప్రయాణించి వచ్చినవారు తమ సొంత రాష్ట్ర పోలీసులే అడ్డుకోవడంతో షాక్ తిన్నారు. పైగా తమ రాష్ట్రంలోకి రావాలంటే ముందుగా క్వారంటైన్ కు వెళ్లాలని పోలీసులు సూచించడంతో పుండు మీద కారం చల్లినట్లు అయింది. పోలీసుల మాటలు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మా ఊరికి మాకు ఎందుకు వెళ్లనివ్వరూ అంటూ పోలీసులతో గొడవకు దిగారు. వేలాది మంది విద్యార్థులు సరిహద్దుల్లోనే పడిగాపులు గాస్తున్నారు.

లాక్ డౌన్ తో హైదరాబాద్ లోని హాస్టల్స్ మూసివేస్తున్నట్లు ప్రచారం జరగడంతో విద్యార్థులు సమీప పీఎస్ లకు వెళ్లారు. సొంత ఊరికి వెళ్లేందుకు ఎన్ వోసీ ఇచ్చిన పోలీసులు 24 గంటల్లో ఇల్లు చేరేలా చూసుకోండి అని సూచించారు. కూకట్ పల్లి , పంజాగుట్ట , మాదాపూర్ , జూబ్లీ హిల్స్ , ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ల లో వేలాది మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు NOCలు జారీ చేశారు.

హైదరాబాద్ నుండి వెళ్లిన వేలాది మంది విద్యార్థులు , ఐటీ ఉద్యోగులు తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో చిక్కుకున్నారు. హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన NOC లకు తాము అంగీకరించమని, ముందుగా క్వారంటైన్ కు వెళ్లాలని చెప్పడం తో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయం ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్‌లో మాట్లాడారు. హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించడంతో రవాణా ఇబ్బందులు వస్తాయని, కరోనా విస్తరణ నేపథ్యంలో వేళ ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడం శ్రేయస్కరం కాదన్నారు బొత్స.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటి వరకూ పోలీసులు ఇచ్చిన ఎన్ వోసీలు చెల్లవని స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి సూచించారు. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే వారందరూ 14 రోజులపాటు హోం క్వారంటైన్‌ తప్పదని డీజీపీ స్పష్టంచేశారు.

హస్టళ్ల యజమానులతో చర్చలు జరపాలని నగర పోలీస్ కమిషనర్‌, మేయర్‌కు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నగర మేయర్‌, పోలీస్‌ కమిషనర్‌ పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్‌ లో హాస్టళ్లు మూసివేస్తున్నారనేది తప్పుడు ప్రచారం అని కొట్టి పారేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఒక్క హాస్టల్‌ కూడా మూసివేయలేదని తెలిపారు. అవసరమైతే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేస్తామని మేయర్‌ హామీ ఇచ్చారు. ఎన్ వోసీ విషయంలో హైదరాబాద్ పోలీసుల తొందరపాటు ఎంత పెద్ద సమస్య తెచ్చిపెట్టిందో తెలంగాణ-ఏపీ సరిహద్దులో విద్యార్థుల పాట్లు ఉదాహరణగా చెప్పవచ్చు.

























Web TitleAndhra Pradesh students suffering with lockdown
Next Story


లైవ్ టీవి