దానంగా ఇచ్చిన స్థలం..వేలం వేయాలని భావిస్తున్న ప్రభుత్వం..తప్పుపడుతున్న స్థానిక జనం!

దానంగా ఇచ్చిన స్థలం..వేలం వేయాలని భావిస్తున్న ప్రభుత్వం..తప్పుపడుతున్న స్థానిక జనం!
x
Highlights

తనకున్న స్థలం పదిమందికి ఉపాధి కల్పిస్తుందని వెనుకటి రోజుల్లో ఒక పెద్దాయన భావించారు. దీంతో ప్రభుత్వానికి భూమిని దానమిచ్చారు. అందులో ప్రభుత్వం కూరగాయల...

తనకున్న స్థలం పదిమందికి ఉపాధి కల్పిస్తుందని వెనుకటి రోజుల్లో ఒక పెద్దాయన భావించారు. దీంతో ప్రభుత్వానికి భూమిని దానమిచ్చారు. అందులో ప్రభుత్వం కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేసింది. దీంతో రైతులకు, చిరు వ్యాపారులకు ఉపాధి లభించింది. ఏడు దశాబ్ధాలకు పైగా ఆ స్థలంలో పండ్లు, కూరగాయల విక్రయాలు జరుగుతున్న సమయంలో బిల్డ్ ఏపీ పేరిట ఓ పిడుగు వచ్చి పడింది. మార్కెట్‌ స్థలాన్ని వేలానికి సిద్ధం చేయటంపై దాత కుటుంబీకులతో పాటు దానిపై ఆధారపడిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరానికి తలమాణికంగా ఉన్న పీవీకే నాయుడు మార్కెట్‌ స్థలంపై స్పెషల్ స్టోరీ.

గుంటూరు నగరంలోని కూరగాయల మార్కెట్‌కు ఘనమైన చరిత్ర ఉంది. 1925 నుంచి ఈ ప్రాంతంలో విక్రయాలు జరిగేవి. ఈ స్థలయజమాని పసుపులేటి వెంకట కృష్ణమ నాయుడు 1945లో అప్పటి గుంటూరు మున్సిపాలిటీ మార్కెట్‌ కోసమని విరాళంగా అందజేశారు. అయితే ఆ స్థలంలో ప్రభుత్వం దుకాణాలు ఏర్పాటు చేసి.. కూరగాయలు, పండ్లు, పూలు విక్రయించేవారికి అద్దెకు ఇచ్చింది. దాదాపు 10వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అన్నీంటికి మించి దుకాణాల అద్దెల రూపంలోనే గుంటూరు నగర పాలక సంస్థకు ఏడాదికి 80 లక్షల రూపాయలకు పైగానే ఆదాయం తెచ్చిపెడుతోంది.

అయితే బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ స్థలాలు అమ్మే క్రమంలో మొదటి విడతగా ఎంపిక చేసిన స్థలాల్లో గుంటూరు మార్కెట్‌ స్థలం కూడా ఉంది. 1.72 ఎకరాల స్థలాన్ని 67.36 కోట్ల రూపాయల ధర రిజర్వ్‌ చేశారు. ప్రజల కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తమ తాత పీవీకే నాయుడు స్థలాన్ని అప్పగించారంటున్నారు ఆయన ముని మనవరాళ్లు.

ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మేయటాన్ని ఆయన కుటుంబీకులు తప్పుపడుతున్నారు. దీనిపై పోరాటం చేస్తామని చెబుతున్నారు. పేదలకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఓ కుట్రలో భాగంగానే పీవీకే కూరగాయల మార్కెట్‌ను ప్రభుత్వం అమ్మేందుకు సిద్ధమైందని ఆరోపిస్తున్నారు ఓ వర్గం నేతలు. ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనను మార్చుకోవాలన్నారు. లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడకు కూరగాయలతో పాటు పండ్లు, పూలు తెచ్చి విక్రయిస్తుంటారు. వారి నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి గుంటూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు సరుకులు పంపిస్తుంటారు. ఇలా నిత్యం కోటి రూపాయల మేర లావాదేవీలు ఇక్కడ జరుగుతుంటాయి.వేలాది మంది వ్యాపారులు, రైతులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories