Vaibhav Sooryavanshi: ముంబై ఇండియన్స్‌పై విఫలమైనా.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన సూర్యవంశీ!
Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు.
Vaibhav Sooryavanshi: ముంబై ఇండియన్స్‌పై విఫలమైనా.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన సూర్యవంశీ!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాటర్.. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో నిరాశపరిచాడు. కేవలం 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. వైభవ్ ముంబైపై రాణించకపోయినా.. ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్‌గా బుడ్డోడు చరిత్ర సృష్టించాడు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ 579 పరుగులతో ఉన్నాడు. ముంబైపై నాలుగు పరుగులతో అతడి మొత్తం పరుగుల సంఖ్య 583కు చేరింది. దీంతో భారత ఆటగాడు దేవదత్ పడిక్కల్ రికార్డు బ్రేక్ అయింది. 2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పడిక్కల్ 580 పరుగులు చేయగా.. వైభవ్ అతడిని అధిగమించాడు. ఈ రికార్డుతో టీ20 టోర్నీ లేదా సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీనేజ్ ఆటగాడిగా వైభవ్ రికార్డుల్లో నిలిచాడు. ఈ సీజన్‌లో వైభవ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 15 మ్యాచ్‌లలో 583 పరుగులు సాధించాడు. అతను 38.86 సగటుతో పాటు 217.50 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఈ సీజన్లో బుడ్డోడు ఎన్నో రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. కేవలం 15 సంవత్సరాల 26 రోజుల వయస్సులో గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 227 బంతుల్లోనే 500 పరుగులు సాధించి.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదాడు. లీగ్ దశలో 30కి పైగా సిక్సర్లు బాది.. ఒకే సీజన్‌లో ఒక భారతీయుడు కొట్టిన అత్యధిక సిక్సర్ల రికార్డు రేసులో నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ముంబైపై రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగింది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. టాప్-4కు చేరుకుంటుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే చివరి ప్లేఆఫ్స్ బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ నెలకొంటుంది. ఇప్పటికే పంజాబ్ 15 పాయింట్లతో తమ లీగ్ దశను ముగించింది. ఇక కోల్‌కతా భారీ విజయం సాధించి నెట్‌రన్‌రేట్ మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.