Mohammed Siraj: ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల నుంచి హైదరాబాద్ ప్లేయర్ అవుట్.. అసలు కారణం ఏంటంటే?

Mohammed Siraj rested for Ireland Series. భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది.

Update: 2026-06-09 12:03 GMT

Mohammed Siraj: ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల నుంచి హైదరాబాద్ ప్లేయర్ అవుట్.. అసలు కారణం ఏంటంటే?

Mohammed Siraj: భారత జట్టు స్టార్ పేసర్, హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విశ్రాంతి కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన టీ20 జట్టులో తొలుత చోటు దక్కించుకున్న సిరాజ్.. తాజాగా ఆ రెండు సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సిరాజ్‌కు విశ్రాంతిని ఇచ్చినట్లు బీసీసీఐ పేర్కొంది.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విశ్రాంతి:

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని భారత జట్టు యాజమాన్యం, బీసీసీఐ వైద్య బృందం కలిసి నిర్ణయించాయి. రాబోయే సుదీర్ఘ అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. సిరాజ్ పూర్తిగా కోలుకుని కీలక సిరీస్‌లకు సిద్ధంగా ఉండేందుకు.. ముందస్తు జాగ్రత్త బీసీసీఐ సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో సిరాజ్ చివరి నిమిషంలో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున 17 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు. తాజాగా అఫ్గానిస్థాన్‌తో ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఆడాడు. గత కొన్ని నెలలుగా వరుసగా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో సిరాజ్ ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు నిర్ణయించారు.

ప్రసిద్ధ్ కృష్ణకు ఇది మంచి అవకాశం:

మహ్మద్ సిరాజ్ స్థానంలో భారత జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఇటీవల గాయాల నుంచి కోలుకున్న ప్రసిద్ధ్.. మళ్లీ భారత జట్టులో స్థానం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ మెరిశాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో తన ప్రతిభను నిరూపించుకుంటే.. వరుసగా భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఐర్లాండ్‌తో జూన్‌ 26న మొదటి టీ20, 28న రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు భారత్ ఆడనుంది.

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.

Tags:    

Similar News