China North Korea Relations: బలపడుతున్న చైనా, కిమ్‌ బంధం... మారుతున్న రాజకీయ భౌగోళిక సమీకరణాలు

ఏడేళ్ల తరువాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. రెండు దేశాల మధ్య బలమైన మైత్రి ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉత్తర కొరియాలో పర్యటించడం వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం.

Update: 2026-06-08 07:28 GMT

China North Korea Relations: అంతర్జాతీయ రాజకీయ యవనికపై సరికొత్త వ్యూహాత్మక సమీకరణాలకు తెరలేచింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో అడుగుపెట్టారు. చైనా,ఉత్తర కొరియా బంధం ఒక "కొత్త చారిత్రక మైలురాయి"కి చేరుకుందని జిన్‌పింగ్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు ఈ ఇరు దేశాల కలయికపై పడింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో ఉత్తర కొరియా బంధం పెంచుకుంటున్న తరుణంలో, ఈ పర్యటన అంతర్జాతీయ రక్షణ రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది.

పర్యటన వెనుక అసలు వ్యూహం... స్నేహం కంటే ఆధిపత్యమే ముఖ్యం

పైకి ఇది స్నేహపూర్వక పర్యటనలా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక చైనా దౌత్యపరమైన వ్యూహాలు దాగి ఉన్నాయి. ఇటీవల ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాతో రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కోసం ఉత్తర కొరియా సుమారు 11,000 మంది సైనికులను, పెద్ద ఎత్తున మందుగుండు సాగ్రిని రష్యాకు పంపింది. ప్రతిగా రష్యా నుంచి ఇంధనం, సాంకేతిక సహకారాన్ని పొందుతోంది. ఉత్తర కొరియాపై రష్యా ప్రభావం పెరగడం చైనాకు మింగుడుపడటం లేదు. అందుకే కిమ్ జోంగ్ ఉన్‌ను తన గుప్పిట్లోనే ఉంచుకోవడానికి జిన్‌పింగ్ ఈ పర్యటనను ఒక ఆయుధంగా మార్చుకున్నారు. అదే సమయంలో, ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే రష్యాకు ఉత్తర కొరియా అవసరం తగ్గుతుంది కాబట్టి, కిమ్ కూడా తన పాత మిత్రుడు చైనాను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. రష్యా, చైనాను తమకు అనుకూలంగా మార్చుకుంటే దక్షిణ కొరియా, జపాన్‌ వంటి దేశాలను బెదిరించేందుకు కిమ్‌కు అవకాశం లభిస్తుంది. పైగా అంతర్జాతీయంగా ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షల నడుమ రష్యా, చైనా దేశాల సపోర్ట్‌తో ఉత్తర కొరియా మరింత పదునుగా కొరకరాని కొయ్యగా మారిందన్నది వాస్తవం.

చైనాపైనే ఉత్తర కొరియా ఆర్థిక భారం

అణు పరీక్షల కారణంగా ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియాకు చైనాయే అతిపెద్ద ఆర్థిక అండ. రష్యా అండ ఉన్నప్పటికీ చైనాతో ఉత్తర కొరియాకు ఉన్న వ్యాపారబంధం బలమైనదనే చెప్పాలి. 2026 మొదటి రెండు నెలల్లోనే ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరిగింది. బంధం మరింతగా బలపడుతోందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఉత్తర కొరియాకు అవసరమైన ఇంధనం, ఆహారం, ఎలక్ట్రానిక్స్‌ ఎక్కువగా చైనా నుంచే వస్తాయి. అదేవిధంగా ఉత్తర కొరియా నుంచి ఎక్కువ మొత్తంలో విగ్గులు, ఖనిజాలు, సీఫుడ్స్‌ని చైనా దిగుమతి చేసుకుంటుంది. అంతేకాకుండా, ఉత్తర కొరియాకు మద్దతు తెలిపే దేశాలకు చైనా ఓడరేవుల నుంచి ఈ గూడ్స్‌ ఎగుమతి అవుతాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యబంధం చాలా బలంగా ఉందని చెప్పవచ్చు.

వారసత్వ రాజకీయ సంకేతాలు

ఈ పర్యటనలో మరో ఆసక్తికరమైన అంశం కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె 'కిమ్ జు ఏ' ఉనికి. చైనా ప్రథమ మహిళ పెంగ్ లియువాన్‌తో జు ఏ భేటీ అవ్వడం ద్వారా, భవిష్యత్తులో ఉత్తర కొరియా పగ్గాలు ఆమెకే దక్కబోతున్నాయనే రాజకీయ సంకేతాలను కిమ్ కుటుంబం చాటిచెప్పినట్లయింది. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటనపై దక్షిణ కొరియా తీవ్రంగా స్పందించింది. ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని అపాలని, చైనా ఇందులో మధ్యవర్తిత్వం వహించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం అమెరికా దూకుడుగా వ్యవహరిస్తూ మిత్రదేశాలకు మద్దతు ఇస్తూ శతృదేశాలను కట్టడి చేయాలని చూస్తున్న తరుణంలో చైనా, రష్యా, ఉత్తర కొరియాలు ఒకేతాటిపైకి రావడం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రిక్స్‌ కూటమిలో భాగస్వామిగా ఉన్న చైనా, రష్యాలు నార్త్‌ కొరియాను కూడా కూటమిలోకి తీసుకువచ్చేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా అనధికారిక సమాచారం. బ్రిక్స్‌ కూటమిలో నార్త్‌ కొరియా చేరితే అమెరికాతో పాటు దాని మిత్రపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఒకవేళ ఈ రెండు దేశాలు అంగీకరించినా...బ్రిక్స్‌ కూటమిలో నార్త్‌ కొరియా చేరేందుకు భారత్ అంగీకరిస్తుందా అన్నది చూడాలి.   

Tags:    

Similar News