ప్రధాని మోడీ 'వెలుగుల' పిలుపు.. సోషల్ మీడియా 'వదంతులు'.. 'నిజం' ఏమిటి?

ప్రధాని మోడీ వెలుగుల పిలుపు.. సోషల్ మీడియా వదంతులు.. నిజం ఏమిటి?
x
representational image
Highlights

ఇదిగో పులి.. అంటే అదిగో తోక! అనడం సోషల్ మీడియా చేసే పని. ఏ విషయాన్నైనా సంచలనంగా మార్చేయాలనే తపన సోషల్ మీడియాలో ఎక్కువ. ఎవరో ఎదో అంటారు. ఇంకెవరో దానిని...

ఇదిగో పులి.. అంటే అదిగో తోక! అనడం సోషల్ మీడియా చేసే పని. ఏ విషయాన్నైనా సంచలనంగా మార్చేయాలనే తపన సోషల్ మీడియాలో ఎక్కువ. ఎవరో ఎదో అంటారు. ఇంకెవరో దానిని చూస్తారు. కొంచెం తన మనసు రంగు దానికి పులుముతారు. దానిని వదులుతారు. అది మరెందరో చూస్తారు. వారందరూ ఇంకెందరి మద్యనో దానిని తిప్పేస్తారు. చివరికి అసలు విషయాన్ని చెప్పిన వారే ఆశ్చర్యపోయేలా మొత్తం కథే మారిపోతుంది. ఇది అంటూ వ్యాధుల కంటే భయంకరమైన వ్యాప్తి. ఇప్పుడు కరోనా కష్టాల సమయంలోనూ అదే జరుగుతోంది.

ఒక్కఫోటో.. వంద వరుసలు..

ఎక్కడో ఎవరో తీసిన ఫోటో సరిగ్గా నిమిషాల వ్యవధిలో రకరకాల కామెంట్లతో లక్షలాదిమందికి చేరిపోతుంది. అది నిజమా? కాదా? అనే ఆలోచన ఎవరికీ ఉండదు. తమకు తెలిసిన విషయాన్ని అందరికీ చెప్పాలనే ఆత్రం అంతే! ఇది రాజకీయ పార్టీల అభిమానుల మధ్యలో అయితే దారుణమైన పరిస్థితుల్ని రేకెత్తిస్తుంది. సినీ అభిమానులు దాదాపు సైబర్ మాటల యుద్ధమే చేసేస్తారు. ఇక సాధారణ జనం అయితే, ప్రాపంచిక విషయాలన్నిటినీ సోషల్ మీడియాలో చూసేసి లేదా చదివేసి అన్నిటినీ నిజమే అనే భ్రమలో అసలు నిజం తెలీక అయోమయంలో పడిపోతారు.

కరోనా కంటే వేగంగా..

ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడ లాడిస్తుంటే ఈ విషయంపై వచ్చే వదంతులు ఆ వైరస్ వేగం కంటే వేగంగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రధాని మోడీ కరోనా వైరస్ కట్టడిపై తనవంతుగా విశేషమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన ఈరోజు (ఏప్రిల్ 5 ఆదివారం) రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్ళలో ఉన్న దీపాలు ఆర్పి వేసి.. ఇంటి గుమ్మంలో నిలబడి కొవ్వొత్తి, టార్చ్, దీపం, సెల్ ఫోన్ లైట్ ఇలా ఎదో ఒక వెలుగును ప్రసారం చేయమని ప్రజలు అందరినీ కోరారు. అయన ప్రసంగం పూర్తి అయిన పది నిమిషాల్లోపే సోషల్ మీడియాలో అసలు ప్రధాని ఎందుకు ఏమని చెప్పారు అనేది కనీసం ప్రజలకు చేరకుండానే.. తమ ఇష్టం వచ్చిన భాష్యాలను చెప్పేసి గందరగోళ పరిచేశారు. ఆ విషయంపై నేరుగా విషం చిమ్మిన వార్తలు కొన్నైతే.. మత విశ్వాసాల్ని తెరపైకి తీసుకువచ్చి పరోక్షంగా చేటు చేసినవి మరికొన్ని. ఇవి అత్యంత వేగంగా ప్రచారం అయిపోయాయి.

మోడీ చెప్పిందేమిటి..దానిలో అర్థం ఏమిటి?

ప్రధాని మోడీ చెప్పిన విషయం కరోనా వైరస్ అనే కంటికి కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నాం. చీకట్లో ఉన్న ఆ శక్తిని ఎదుర్కునే సమైక్యత మాలో ఉంది అని వెలుగులు చూపించి చాటి చెప్పుదాం అని చెప్పారు. ఒక యూనిక్ సమయాన్ని అయన అందుకు ఎంచుకున్నారు. రాత్రి 9 గంటలకు దాదాపుగా అందరూ భోజనాలు చేసి టీవీల ముందు కూర్చునే సమయం. ఈ సమయంలో ఇంట్లో అందరూ బయటకు వచ్చి దీపాలతో నిలబడితే.. ఎలా ఉంటుందో ఊహించండి.

ప్రచారాలు ఇవే..

9 శక్తి సంఖ్యా..అందుకే 9 గంటలకు 9 నిమిషాలు అని అన్నారు. ఇది దేవీ ఆరాధకులు చేసే పని అని ఒకరు.. మేం దేవుని ముందు దీపాలు వెలిగించం.. మా విశ్వాసాల్ని దెబ్బతీయడానికే ఈ పని చేయమన్నారు మోడీ అని ఒకరు.. ప్రజలంతా కరోనాతో అల్లాడుతుంటే, దీపాలు వెలిగించామంటున్నారని విసుక్కునే వారు ఒకరు.. కొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్లి రాజకీయ ప్రచారం కోసమే ఈవిధమైన చర్యలు చేపడుతున్నరానీ ఇలా తలా తోకా లేని వ్యాఖ్యలు ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నిజం ఏమిటి?

ఇందులో ఒక్కటి కూడా నిజం కాదు. కరోనా నేపధ్యంలో అందరూ దాదాపుగా రెండు వారాలుగా పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన పరిస్థితి. ఎక్కడైనా ఎవరైనా తుమ్మినట్టు లేదా దగ్గినట్టు చప్పుడు వినపడినా అందరూ ఉలిక్కిపడుతున్న స్థితి. ఇన్ని రోజులు పక్కింటి వారెలా ఉన్నారో కూడా తెలుసుకోలేని దయానీయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. వారిలో ఓ స్ఫూర్తిని నింపడం కోసమే ఈ కార్యక్రమం అని అనుకోవచ్చు. ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవడానికి దీపాలు ప్రదర్శించడం ద్వారా మనమంతా ఒక్కటిగా ఉన్నామనే సంకేతాన్ని ఇవ్వడానికి ఈ సందర్భం ఒకటి ప్రధాని మోడీ సూచించారని అనుకోవచ్చు. ప్రజల మనస్సులలో ఒంటరితనం అనే భావన నుంచి కాస్త ఉపశమనం కలిగించే విషయంగా దీనిని తీసుకోవచ్చు. అంతే తప్ప దీనిలో ఎటువంటి ఖగోళ..భూగోళ సంబంధమైన విషయాలు లేవు. జాతకాలు.. రాశులు.. విశ్వాసాలు ఇవన్నీ వారి వారి ఆలోచనలు తప్ప సామాజికంగా వీటిని ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు.

ఇలా చేయడం లో నష్టం లేదు..

అన్ని విషయాలనూ లాభ నష్టాలతోనో.. రాజకీయలతోనో, కులమతాలతోనో ముడి పెట్టడం సరికాదు. ఇప్పుడు ప్రధాని మోడీ సూచించిన ఈ ప్రక్రియ కూడా అంతే. ఈ సూచనలో ఏం మర్మం ఉంది అని కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే పని మాని, దేశాన్ని నడిపించే నాయకుడు ఇచ్చిన పిలుపు. కష్ట సమయంలో ఇలా చేయమన్నారు. దీనిలో లాభం లెక్క ఎలా ఉన్నా నష్టం అయితే లేదు. చేయడంలో తప్పేముంది? అని ఒక్కసారి అందరూ తమను తాము ప్రశ్నించుకుని.. సోషల్ మీడియా మాయను పక్కన పెట్టి ఈరోజు రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు ప్రతి ఇంటి ముందు వెలుగులు ప్రసరింప చేద్దాం. భారత జాతి సమైక్య పోరాట విధానాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories