నేడే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ: సాయంత్రం 6.25కి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై ఎప్పుడన్నది తేలిపోయింది. సోమవారం మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. సాయంత్రం 6.25కి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మొత్తం ముగ్గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఈ మేరకు రాజ్ భవన్ కు సమాచారం అందింది. ఊహించినట్టుగానే సీఎం సన్నిహితుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కొండ్రుమురళి, ప్రసాద్ లకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. భట్టి విక్రమార్కల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు మంత్రి పదవి ఆశించిన గండ్ర వెంకటరమణారెడ్డికి చీఫ్ విప్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. హుజూర్ నగర్ ఎమ్మెల్యే. మంత్రి వర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడవడం, వివాదరహితుడు కావడం.. ఉత్తమ కుమార్ రెడ్డికి కలిసొచ్చాయి. మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అగ్రికల్చరల్ బిఎస్సీ చదవి, భారత వైమానిక దళంలో పైలట్ గా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సేవలందించారు.
అయితే తనకిచ్చిన ఏ బాధ్యతనైనా సమర్ధవంతంగా నిర్వహిస్తానని ప్రభుత్వ విప్ కొండ్రు మురళి అన్నారు. మంత్రి పదవి ఇచ్చినందుకు సోనియా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.