Next


జాబ్ పాయింట్
జాబ్ పాయింట్

భారత్‌లో 10 లక్షల ఉద్యోగాలపై వేటు

భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఒక వైపు ఊదర గొడుతూనే ఉంది. మరోవైపున ఈ ఏడాది ఇంతవరకు భారత్‌లో అన్ని కంపెనీలు కలిసి ఉద్యోగులను సాగనంపిన సంఖ్య 10 లక్షలకు దాటింది. అన్నిటికంటే బ్యాంకింగ్, ఫైనాన్షయల్ సేవలు, ఐటి, బీపీఓ, దుస్తులు, ఎగుమతులు, ఆటోమొబైల్ రంగాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఈ ఒక్క ఏడాదిలోనే 10 లక్షల మంది ఉద్యోగులు భారత్‌లో ఇంటి ముఖం పట్టవలసి వచ్చింది. దేశ ఆర్థిక తిరోగమనానికి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తోడవడంతో ఉత్పత్తులు, ఆదాయాలు, పెట్టుబడులు ఘోరంగా దెబ్బతిన్నాయి. దీని ఫలితంగా పలు భారతీయ కంపెనీలు మనుగడ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో ఉద్యోగుల నియామకాలు 30 శాతం వరకు తగ్గాయని అంచనా. కాగా, తీవ్రంగా దుష్ప్రభావానికి గురైన రంగాల్లో కొత్త నియామకాలు 50 శాతం వరకు తగ్గిపోయాయి. భారత్‌లో కార్పొరేట్ రంగం 2009లో సృష్టించనున్న ఉద్యోగాల సంఖ్య అంతకుముందు కన్న 3 లక్షలు తక్కువగా ఉందంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 145 డాలర్లనుంచి 57 డాలర్లకు పడిపోయిందన్న వార్త మినహా మరే శుభవార్త కూడా భారత్‌లో ప్రస్తుతం ఎవరి చెవిని సోకడం లేదు. కార్పొరేట్ ప్రపంచంలో అగ్రగామి సంస్థల పేర్లను ఇప్పుడు తిరోగమన దృక్పధం నుంచి అంచనా వేయవలసి వస్తోంది. ఏ కంపెనీ అత్యధికంగా ఉద్యోగులను పీకేసేంది, ఇంకా ఎంతమందిని తొలగించనుంది అనేదే కంపెనీలపై అంచనాలకు ప్రస్తుతం గీటురాయిగా ఉంటోంది. మోటరోలా, గోల్డ్‌మాన్ సాక్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మెరిల్ లించ్, రిలయన్స్ రిటైల్, జిందాల్ స్టీల్, రియల్ ఎస్టేట్ దిగ్గజం డిఎల్ఎఫ్, ఎల్ అండ్ టి, ఇన్పోటెక్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లే ఉన్నాయి. అన్నీ ఉద్యోగులను సాగనంపడంలో ముందువరుసలో ఉంటున్నాయి. భారత్‌లో భారీ మొత్తం నగదును వ్యయం చేసి కీలకరంగాల్లో ఉద్యోగాలకోసం శిక్షణ పొందిన వారికి ఇప్పుడు కనుచూపు మేరలో ఉద్యోగాలు లేవు. కంపెనీలలో కొత్తగా చేరిన జూనియర్ ఉద్యోగులపైనే తొలగింపు భారం పడడంతో దేశంలో లక్షలాది యువతీయువకులు రిజర్వ్ సైన్యంలా తయారయ్యారు. వీరికి తోడుగా ఖర్చులను తగ్గించుకునే పథకాల్లో భాగంగా విదేశాల్లో సైతం భారతీయ నిపుణులను భారీగా తొలగిస్తుండటంతో అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు స్వదేశంలో ఉద్యోగావకాశాలకోసం తిరిగి చూస్తున్నారు. ఈ నేపధ్యంలో రిజర్వ్ సైన్యం శాతం పెరిగిపోయి సంక్షోభం మరింత ఉధృతమవనుంది.

భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఒక వైపు ఊదర గొడుతూనే ఉంది.