కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనమై ఏడాది పూర్తి
పిఆర్పీ కాంగ్రెస్ లో విలీనమై ఏడాది పూర్తయినా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆ భావన పూర్థిస్థాయిలో నెలకొనలేదు. ప్రజారాజ్యం నేతలను వారు నాయకులుగా అంగీకరించలేకపోతున్నారు. దీనికి ఉదాహారణే మంత్రి సి రామచంద్రయ్యకు లభించిన స్వాగతం ఘటన. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. తొలిసారి సొంత నియోజకవర్గం వెళ్లేందుకు ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అయితే స్వాగతం పలికినవారంతా పిఆర్పీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కార్యకర్తలే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాకపోవడం.. పార్టీలో వారి విలీన పరిస్థితిని తెలియజేస్తోంది. రామచంద్రయ్య చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. అందుకే.. జిల్లా కాంగ్రెస్ నేతలు ఎందరు వ్యతిరేకించినా పట్టుబట్టి అధిష్ఠానంతో మాట్లాడి మంత్రి పదవి ఇప్పించారు. అయితే.. చిరు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోనే కాంగ్రెస్, పిఆర్పి శ్రేణులు విడిగా ఉండటం కలవరానికి గురిచేస్తోంది.
గతంలో చిరంజీవి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిన నేపథ్యంలో పిఆర్పీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. అయితే బయట మాట్లాడ్డానికి సిద్ధపడకపోయినా చిరంజీవి దృష్టికి మాత్రం తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అవసరమైతే పిసిసి నుంచి ప్రత్యేక ఆదేశాలు కూడా ఇప్పించాలని చిరును కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి క్యాడర్ ప్రవర్తనతో పార్టీకి కొత్తచిక్కులు వచ్చిపడేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.