TS TET Fee: తెలంగాణ టెట్ ఫీజు పెంపుపై నిరుద్యోగుల నిరసనలు

Unemployed Protest against Telangana TET Fee Hike
x

TS TET Fee: తెలంగాణ టెట్ ఫీజు పెంపుపై నిరుద్యోగుల నిరసనలు

Highlights

TS TET Fee: ఒకేసారి వెయ్యికి పెంపుపై అభ్యర్థుల ఆందోళన

TS TET Fee: తెలంగాణ టీఎస్‌టెట్‌ ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్‌ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్‌కు ఒక్కో పేపర్‌కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్‌ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్‌కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్‌ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్‌ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం.

అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచ్చినా... తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్‌ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. ఏదిఏమైనా దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టెట్ ఫీజును తగ్గించేందుకు ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories