మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపై.. ఎమ్మెల్యేల బంధువుల కన్ను

మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపై.. ఎమ్మెల్యేల బంధువుల కన్ను
x
Highlights

మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపై ఎమ్మెల్యేల బంధువులు కన్నేశారు. మెజారిటీ ఛైర్మన్ పదవులు తమ బంధుగణానికి దక్కేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. తమ సామాజిక...

మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపై ఎమ్మెల్యేల బంధువులు కన్నేశారు. మెజారిటీ ఛైర్మన్ పదవులు తమ బంధుగణానికి దక్కేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి అనుగుణంగా మున్సిపల్ ఛైర్మన్ రిజర్వ్ అయ్యే విధంగా ఎమ్మెల్యేలు పావులు కదుపుతుంటే మున్సిపల్ పీఠంపై కన్నేసిన బంధువులు బస్తీలను చుట్టొస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిన అధికార పార్టీ ఛైర్మన్ పీఠాలను తమ బంధువులకు దక్కేలా ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. రిజర్వేషన్లు ఖరారు కాకున్నా పలానా మున్సిపాలిటీలో ఛైర్మన్ అభ్యర్ధి వాళ్లే అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న వాళ్లంతా ఎమ్మెల్యేల బంధుగణం కావడంతో ఛైర్మన్ పీఠంపై కన్నేసిన ద్వితీయ శ్రేణి నేతలు మిన్నకుండిపోతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ ఛైర్మన్ రేసులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోదరుడు రాజేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మున్సిపల్ పీఠంపై కన్నేసిన అధికార పార్టీ కేసీఆర్ పథకాలను నమ్ముకుంది. ఛైర్మన్ సీటుపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే సోదరుడు తన అన్న చేసిన అభివృద్ధిని నమ్ముకుని ప్రజలతో మమేకం అవుతున్నారు. రిజర్వేషన్ ఖరారు కాకున్నా ఛైర్మన్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటూ వార్డులను చుట్టొస్తున్నారు. ఛైర్మన్ పీఠం జనరల్ కు రిజర్వ్ అవుతుందనే ప్రచారంతో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ రెడ్డి సైతం తన భార్య అనన్య రెడ్డిని ఛైర్మన్ రేసులో నిలబెట్టారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్ - బీజేపీల మధ్య ఉండటంతో ఇక్కడి పోటీ రసవత్తరంగా మారింది.

జిల్లాలోని బోధన్ మున్సిపాలిటీ ఛైర్మన్ రేసులో ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ భార్య ఆయోషా ఫాతిమా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రచారానికి బలం చేకూర్చేలా ఆమె కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఎం.ఐ.ఎం. పొత్తుతో ఈజీగా ఛైర్మన్ పీఠం దక్కించుకోవచ్చనే అంచనాలో ఉన్న ఎమ్మెల్యే షకీల్ అందుకు అనుగుణంగా ఛైర్మన్ పీఠం తన భార్యకు దక్కేలా పావులు కదుపుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. బోధన్ లో గతంలో 35 వార్డులు ఉండగా విలీన గ్రామాలతో కలిపి 38 వార్డులుగా ఖరారు చేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 స్ధానాల్లో, ఎంఐఎం 7 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 15 వార్డుల్లో గెలవగా బీజేపీ 3 స్ధానాలకు పరిమితం అయ్యింది. ఇతరులు ఓ వార్డులో గెలిచారు. టీఆర్ఎస్ -ఎంఐఎం కలిసి మున్సిపాలిటీని గతంలో కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు బీజేపీ- టీఆర్ఎస్ -ఎం.ఐ.ఎం. మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఆయోషా ఫాతిమా 35 వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.

గ్రామ పంచాయతీ నుంచి. కొత్తగా మున్సిపాలిటీగా ఆవిర్బవించిన బాన్సువాడ మున్సిపల్ తొలి ఛైర్మన్ కావాలని చాలా మంది నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. తొలి ఛైర్మన్ గా గెలిస్తే చరిత్రలో నిలిచిపోతామని భావనలో ఛైర్మన్ రేసులో బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పోచారం శంభురెడ్డి కన్నేశారు. సోదరున్ని ఛైర్మన్ చేయాలనే ఆలోచనలో స్ధానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఉన్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పోచారం శంభురెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. బాన్సువాడలో సరస్వతి ఆలయ కమిటీ ఛైర్మన్ గా కొనసాగుతున్న శంభురెడ్డి 1వ వార్డు నుంచి పోటీచేయాలని ఆలోచనలో ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు.

ఎమ్మెల్యేల బంధుగణం మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపై కన్నేసి చాపకింద నీరులా తమ పనికానిస్తున్నారు. ఐతే ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకున్నా అభ్యర్ధుల ఎంపిక జరగకున్నా సదరు నేతల బంధువులు మాత్రం అంతా తామే అన్నట్లుగా దుసూకెళ్తున్నారు. ఛైర్మన్ పీఠాలపై ఎమ్మెల్యేల బంధువుల కూర్చోబెడుతారనే ప్రచారం ఆ పీఠాలపై కన్నేసిన ద్వితీయశ్రేణి నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories